భారత దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిలో లేదు. ఆంధ్రా ప్రాంతమంతా మదరాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటే, తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టుల పేరు బరిలోకి దిగి 41 చోట్ల గెలిచింది. కమ్యూనిస్టులకు 20.09 శాతం ఓట్లు వచ్చాయి. అపుడు అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారా అన్నంత చర్చ జరిగింది.
ఇతర చిన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరు పోటీ చేసి 37 చోట్ల విజయం సాధించింది. 1955లో జరిగిన ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు ఆంధ్ర పాంతంలో 30.82 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు అధికారానికి దగ్గరగానే ఉన్నా.. 1962 తర్వాత పార్టీలో వచ్చిన చీలిక వారిని బలహీన పరిచినా కూడా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు ఉమ్మడి ఏపీ శాసన సభలో వారి గొంతు బలంగానే వినిపించింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరీ దారుణంగా ఆ పార్టీల పరిస్థితి పడిపోయింది. 2023 శాసన సభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం ఔరా అనిపిస్తోంది.
గత గణాంకాలకే ఇక పరిమితమా..?
కమ్యూనిస్టులు ఉమ్మడిగానే ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు తేలిగ్గా కొట్టిపారేయలేం. అందుబాటులో ఉన్న ఎన్నికల గణాంకాల ప్రకారం చూసినా.. రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినంత దగ్గరగా వచ్చిన పార్టీ. ఆంధ్ర ప్రాంతంలో 1952 ఎన్నికల్లో 41 సీట్లు, 1955 ఎన్నికల్లో 15 స్థానాలు, తెలంగాణ ప్రాంతంలో 1952లో 37 సీట్లు, 1957లో 22 సీట్లు ఏపీ ఏర్పడిన తర్వాత 1962లో 51 సీట్లను కమ్యూనిస్టులు గెలుచుకున్నారు. 1964లో కమ్యూనిస్టుల్లో చీలిక ఏర్పడి సీపీఐ నుంచి విడివడిన వర్గం సీపీఐ (ఎం)గా ఏర్పడింది.
1964 మధ్యంతర ఎన్నికల్లో సైతం సీపీఐ 31, సీపీఎం 22 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నాయి. ఒక సీపీఐ గురించి మాత్రమే చర్చిస్తే.. 1967లో 11, 1972లో 7, స్థానాలకు మాత్రమే పరిమితమై తన గ్రాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చింది. తెలంగాణ పరిధిలోని 119 స్థానాల అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడుకున్నా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుతో 2014లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. 2018లో ఒక చోటా గెలవలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సీపీఐ ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క చోట నుంచే పోటీ చేయడం విశేషం.
30 నియోజకవర్గాల ప్రాతినిధ్యం నుంచి ఒక్క స్థానానికి
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఒక్కో ఎన్నికకు పోటీ చేసే స్థానాల సంఖ్యను కుదించుకుంటూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐకి 30 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉండింది. ఆ స్థానాల నుంచి ఒకసారి మొదలు ఆరేడు పర్యాయాలు గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఆసీఫాబాద్‌లో సీపీఐ మూడు సార్లు గెలిచింది. ఆదిలాబాద్‌లో ఒక సారి ప్రాతినిధ్యం వహించింది. హుస్నాబాద్ (ఇందుర్తి రద్దయినది) నియోజకవర్గంలో ఆ పార్టీ ఏకంగా 6 సార్లు గెలిచింది. సాయుధ తెలంగాణ సేనాని బద్దం ఎల్లారెడ్డి ఇక్కడి గెలిచారు. దేశిని చినమల్లయ్య నాలుగు సార్లు విజయం సాధించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక సారి గెలిచారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. మెదక్, పెద్దవూర (ఇపుడు నాగార్జున సాగర్), నల్గొండ, భువనగిరి, నకిరేకల్, ఆలేరు, జనగామ, స్టేషన్ ఘనపూర్, నర్సంపేట, పరకాల, చేర్యాల (రద్దు అయ్యింది), పాలేరు నియోజకవర్గాల్లో ఒక్కో సారి విజయం సాధించి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీపీఐ 5 సార్లు గెలిస్తే.. అన్న సార్లూ చిలుముల విఠల్ రెడ్డి గెలిచారు. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి సీపీఐ ఏకంగా 7 విజయాలను నమోదు చేసింది. బద్దూ చౌహాన్ హ్యాట్రిక్ సాధించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో కూడా ఇక్కడ సీపీఐ నుంచి రవీంద్ర కుమార్ గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మునుగోడు నియోజకవర్గంలో కూడా సీపీఐకి 6 విజయాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో రద్దయిన మరో నియోజజకవర్గం రామన్నపేట నుంచి 4 సార్లు గెలిస్తే ఇందులో వరసగా మూడు సార్లు గెలిచిన గుర్రం యాదిగిరి రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. మహబూబాబాద్ లో 2 సార్లు, రద్దయిన బూర్గంపాడు (ఇపుడు పినపాక)లో 5 సార్లు, సుజాతనగర్ (ఇపుడు వైరా)లో 5 సార్లు, భద్రాచలంలో 2 సార్లు గెలిచింది.
ఇక, ఇపుడు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెంలో గతంలో రెండు సార్లు గెలిచింది. ఈ సారి అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గతంలో కూడా ఒక సారి విజయం సాధించారు. ఇంతగా విజయాల చరిత్ర ఉన్నా.. కేవలం ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్‌తో రాజీపడిపోవడాన్ని చివరకు పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేక పోతున్నాయి.
:::మిత్రా. ఎన్
Comments
Please login to add a commentAdd a comment