జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.
లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట.
చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!
ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట.
ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట.
చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్‌సీపీదే జయభేరీ
ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment