
రూల్స్ ప్రకారమే పిన్నెల్లితో జగన్ ములాఖత్
ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది ఏం లేదు
పైగా అడ్డుకునే ప్రయత్నం అడుగడుగునా చేశారు
భద్రతా వైఫ్యలం స్పష్టంగా కనిపించింది
జగన్ ప్రసంగాన్ని ఆమె సరిగ్గా చూడాల్సింది
హోం మంత్రి అనితకు మాజీ మంత్రి కాకాణి కౌంటర్
నెల్లూరు, సాక్షి: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్న హోం మంత్రి అనిత ప్రకటనలో ఎలాంటి నిజం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. పైగా ఆయన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నించిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ ములాఖత్ అయిన క్రమంలో ఎక్కడా నియమ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు. అంతా రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం. పైగా నిర్ణీత టైం కంటే ముందే ములాఖత్ ముగిసింది. అయితే జగన్‌కు ములాఖత్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించామని హోం మంత్రి అనిత చెప్పారు. ఉదారంగా కాదు.. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
జగన్ పర్యటిస్తే వేల మంది వస్తారని వాళ్లకు తెలుసు. అలా వస్తే వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ బయటపడుతుందని భయపడ్డారు. అందుకే పోలీసుల ద్వారా జగన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు. పర్యటనకు అనుమతులు ఇవ్వకుండా చివరిదాకా ఇబ్బందులు పెట్టారు. ఒకానొక టైంలో ములాఖత్ రద్దు చేస్తున్నామని చెప్పారు. అయితే పర్యటనకు ముందు రోజూ రాత్రి కనుపర్తిపాడుకి అనుమతి ఇచ్చారు. జగన్ నెల్లూరుకు వచ్చే 20 నిమిషాల ముందు కూడా జైలు వద్దకు వేలమంది వచ్చారని, ములాఖత్ రద్దు చేశామని జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. జగన్ పర్యటనకు నామ మాత్రపు భద్రత ఇచ్చారు. అందుకే జనాలు హెలిప్యాడ్‌లోకి దూసుకురాగలిగారు.
పిన్నెల్లి వ్యవహారంలోనూ కక్షపూరితంగా వ్యవహరించారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తికి మద్దతు పలకడానికి జగన్ వచ్చారా? అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. ఆమె అసలు జగన్ ఏం మాట్లాడారో పూర్తిగా విన్నారా? లేదంటే అనుకూల మీడియా ఎడిటింగ్‌లు చేసిన వీడియోలు చూసి అలా మాట్లాడారా? అర్థం కావడం లేదు. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, ఇది అన్యాయమని మాత్రమే జగన్ అన్నారు. అలాగే.. 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయిన ఘటనలు జరిగాయని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల్లిపైనే కేసు ఎందుకు పెట్టారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదా? అని కాకాణి ప్రశ్నించారు.