దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. అంటే ఆమె పూర్తిగా తెలిసే ఆ మార్గంలో వెళుతున్నారా?.. తన రాజకీయ ప్రయాణపు పర్యావసనాలు తనకు అర్థం అవుతున్నాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయంగా షర్మిల వేస్తున్న అడుగులు.. ఆమె చేస్తున్న కామెంట్లు.. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు సగటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను బాధిస్తున్నాయి. దీంతో పాటుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆనాడు భూతంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ నేడు షర్మిల కంటికి దేవతలా కనిపిస్తోందా?. నాటి విషవృక్షమే నేడు కల్పవృక్షము అయ్యిందా? అంటున్నారు.
తమ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ముద్దయిందా?. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టి ఆయన్ను అవినీతిపరుడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి, తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచన చేరడానికి షర్మిలకు ఏమీ సిగ్గు అనిపించడం లేదా?. ఇవీ ఓ సగటు వైఎస్ కుటుంబ అభిమానుల మదిలో తొలుస్తున్న ప్రశ్నలు. ఇదిలా ఉండగా ఆనాడు వైఎస్సార్ కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకోగా దానికి అప్పట్లో చంద్రబాబాబు సహకరించారు.
అలాంటి చంద్రబాబు ఉన్న కాంగ్రెస్ గ్రూపులో చేరి పుట్టింటికి నిప్పు పెట్టే దుస్సాహసానికి షర్మిల పాల్పడడాన్ని వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వస్తూనే జగన్ రెడ్డి అంటూ మాట్లాడటం ఆమె దురుసుతనాన్ని గుర్తు చేస్తోంది. చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఆడిస్తున్న రాజకీయ వైకుంఠపాళిలో షర్మిల అడుగుపెట్టారని, ఆమె అక్కడి విషసర్పాల నోటికి చిక్కి పరువుపోగొట్టుకోవడం ఖాయం అని అంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా తాను.. సీఎం వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాణం ఎక్కుబెట్టినట్లు ఆమె మాటలు ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిలేదని, ఉద్యోగాలు లేవని, ఎక్కడ ప్రగతి, ఉపాధిలేదని అంటున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో రెచ్చగొట్టేందుకు చేస్తున్నారో కానీ ఆమె కామెంట్లు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంటే అన్నను నష్టపరచడం ద్వారా ఆమె సాధించే ఫలితం ఎవరికి దక్కుతుంది?. ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే తనకు ఏమైనా లాభమా? ఒకనాడు తన కన్నవారి కుటుంబాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కాంగ్రెస్‌తో కలిపి కుట్రలు చేసిన తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించడమే ఆమె లక్ష్యమా?. ఈ సవాలక్ష సందేహాలు.. ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందేమో..
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment