![Arvind Kejriwal congratulates 'BJP's CM face Ramesh Bidhuri](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/11/Arvind-Kejriwal.jpg.webp?itok=oBEsZxOR)
బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనట
ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు
తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి మాజీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బిధూరీని ఒకట్రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించవచ్చంటూ తనకు సమాచారముందని చెప్పారు. బిధూరీ అయినా మరెవరైనా సరే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
సీఎం అతిశీ పోటీ చేసే కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ రమేశ్ బిధూరీని పోటీకి నిలిపింది. శుక్రవారం సీఎం అతిశీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ‘దుర్భాషలాడటంలో ఆరితేరి’న రమేశ్ బిధూరీని ఎంపిక చేసిందని చెప్పారు. సీఎం అతిశీ తన ఇంటి పేరును మర్లెనా నుంచి సింగ్‌కు మార్చుకోవడం ద్వారా తండ్రిని కూడా మార్చేశారని బిధూరీ అన్నారు.
అదేవిధంగా, ఢిల్లీలో రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ బిధూరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తను పోటీ చేసే న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ఎంపీలు ఓట్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ సొంత నియోజకవర్గాలకు మార్చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు. బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అధికార నివాసం పేరుతో 33 ఓట్లను బదిలీ చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి, వర్మను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. పోలింగ్ బూత్‌లను కబ్జా చేసుకోవడం కంటే ఇది అధ్వానమైన చర్యగా అభివర్ణించారు.
ఇదీ చదవండి:
కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ.. సీఎం అతిశీ వర్సెస్ రమేష్ బిదూరి
Comments
Please login to add a commentAdd a comment