![Arvind Kejriwal is Kingpin Liquor Scam: Anurag Thakur - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/08/21/anurag-thakur.jpg.webp?itok=ry2bMw5T)
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో లిక్కర్ కుంభకోణంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. లిక్కర్ అక్రమాల వ్యవహారంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తును రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. విషయాన్ని పక్కదారి పట్టించొద్దని అన్నారు. ఆప్ నాయకుల అసలు రంగు బయపడిందని చెప్పారు.
అనురాగ్ ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారు ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుండడం చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆప్ అసలు ఖాతా తెరవలేదని గుర్తుచేశారు. 2014, 2019 తరహాలో 2024లోనూ మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు.
చదవండి: ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
లిక్కర్ కుంభకోణంలో తలెత్తుతున్న ప్రశ్నలకు ఆప్ నేతలు సమాధానం చెప్పాలని అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఆప్ ప్రభుత్వం రేవడీ(ఉచితాలు), బేవడీ(తాగుబోతులు) ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకుండా లిక్కర్ కంపెనీలకు రూ.144 కోట్ల మేర ఎందుకు లబ్ధి చేకూర్చారో చెప్పాలన్నారు. ఈ కేసులో మనీశ్ సిసోడియా మొదటి నిందితుడు అయినప్పటికీ అసలు సూత్రధారి కేజ్రీవాలేనని తేల్చిచెప్పారు.
మనీశ్‌ను ‘మనీ ష్’గా అభివర్ణించారు. లంచాలు మింగేసి, అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ ఎడమ భుజం సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలులో ఉన్నారని, కుడి భుజం మనీశ్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఠాకూర్ ఎద్దేవా చేశారు. అవినీతికి వ్యతిరేకం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
చదవండి: ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment