ఆప్‌తోనే పంజాబ్‌ కలల సాకారం | Arvind Kejriwals Wife And Daughter To Campaign | Sakshi
Sakshi News home page

ఆప్‌తోనే పంజాబ్‌ కలల సాకారం

Published Sat, Feb 12 2022 10:53 AM | Last Updated on Sat, Feb 12 2022 12:49 PM

Arvind Kejriwals Wife And Daughter To Campaign - Sakshi

ధురి (పంజాబ్‌): పంజాబ్‌లో ఆప్‌ గెలుపు కోసం పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రివాల్‌ భార్య సునీత, కూతురు హర్షిత కూడా చెమటోడుస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ తరఫున శుక్రవారం ధురి అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్లు ప్రచారం చేశారు. ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబ సంక్షేమం కోసం కలలు కనే, వాటిని నిజం చేసే ఏకైక పార్టీ ఆప్‌ మాత్రమేనన్నారు.

పరిశుభ్రమైన తాగునీరు, కరెంటు, విద్య, మెరుగైన ఆరోగ్య వసతులు అందరికీ ఉచితంగా అందాలి. ఆప్‌ మాత్రమే దీన్ని సుసాధ్యం చేయగలదు’’ అన్నారు. ఉచిత విద్య, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య తదితర మౌలిక సదుపాయాలకు కేజ్రివాల్‌ హామీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 కూతుళ్ల చదువుకు ఉపయోగపడుతుందన్నారు. పంజాబ్‌ రైతుల సమస్యలను పార్లమెంటులో చిరకాలంగా లేవనెత్తుతున్న ఏకైక ఎంపీ భగవంత్‌ మాన్‌ మాత్రమేనని చెప్పారు. 

రాష్ట్రంలోని చిన్నారుల భవిష్యత్తే ఆప్‌కు ముఖ్యమని హర్షిత అన్నారు. వారందరికీ నాణ్యమైన స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు కావాలన్నారు. ప్రచారంలో మాన్‌ తల్లి హర్పాల్‌ కౌర్, సోదరి మన్‌ప్రీత్‌ కూడా పాల్గొన్నారు.  

యూపీ పీఠానికి అదే దారి?
కస్‌గంజ్‌: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్‌గంజ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే.  2007లో కస్‌గంజ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్‌ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్‌ సింగ్‌ కస్‌గంజ్‌లో విజయం సాధించారు.

ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్‌ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్‌దీప్‌ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్‌ సింగ్‌ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్‌ వర్మకు టికెట్‌ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్‌ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement