సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ అలియాస్ హనీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించి హనీకి మనీల్యాండరిం గ్‌తో సంబంధాలున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి చాలా సేపు హనీని విచారించి అనంతరం పీఎంఎల్ చట్టం కింద అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. విచారణలో సహకరించనందుకే హనీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయన్ను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. గతనెల 18న హనీ నివాసాలపై ఈడీ దాడులు జరిపి రూ. 8 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ప్రత్యర్థులకు అస్త్రం
హనీ అరెస్టుతో పంజాబ్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు, సొంతపార్టీలోని వ్యతిరేకులకు చన్నీ మేనల్లుడి అరెస్టు వరంలా మారనుందని నిపుణుల అంచనా. ఈనెల 6న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ప్రకటించే నేపథ్యంలో చన్నీకి చాన్సు లభించడంపై ఉత్కంఠ నెలకొంది. హనీ అరెస్టు రాజకీయ గిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే చన్నీ బంధువుల్లో ఒక్కరే 111 రోజుల చన్నీ పాలనలో కోట్లు కూడబెడితే, ఆయన చుట్టాలంతా కలిసి ఎంత పోగేసి ఉంటారో ఊహించవచ్చని ఆప్ పార్టీ దుయ్యబట్టింది. ఈ విషయంలో చన్నీ సమాధానం చెప్పాలని శిరోమణి అకాలీదళ్ నేత మజితియా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment