సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్‌డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్‌రావు అయితే టికెట్ కోసం ఎన్‌టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు.
కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment