వేములవాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే మేడిగడ్డకు ఈ దుస్థితి పట్టిందని, ఈ అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర గురువారం సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, వేములవాడ అర్బన్ మండలాల్లో కొనసాగింది.
వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ సహా ఇతర బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లానింగ్, డిజైన్, నిర్వ హణ విషయంలో రాష్ట్రాన్ని 20 అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థలు వివరణ కోరితే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 11 అంశాలకే వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా, ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు రూ.1,408 కోట్ల కేంద్రం నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయన్నారు.
ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి రాణి రుద్రమ, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ తదితరులు బండి సంజయ్ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment