
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..