న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ‘సెంచరీ’ కొట్టి రికార్డు సృష్టించింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా 100 మంది రాజ్యసభ సభ్యులను కలిగిన ఘనత సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో అసోం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటును గెలుచుకోవడంతో బీజేపీ ‘వంద’ మార్క్‌ను అందుకుంది. 1990 తర్వాత వంద మంది రాజ్యసభ సభ్యులను కలిగిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది.
ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మూడు ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కటి చొప్పున బీజేపీ గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు స్థానాలు ప్రతిపక్ష పార్టీలవే కావడం గమనార్హం. పంజాబ్‌లో తనకున్న ఒక స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఐదు స్థానాల్లోనూ విజయం సాధించింది. (క్లిక్: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు)
తాజా ఎన్నికల ఫలితాలను రాజ్యసభ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 97 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా గెలిచిన మూడు సీట్లు కలిపితే బీజేపీ సభ్యుల సంఖ్య వందకు చేరుకుంటుంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో రాజ్యసభలో బీజేపీకి 55 మంది సభ్యులు ఉండగా.. తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ సంఖ్య ఇపుడు సెంచరీ మైలురాయిని అందుకుంది.
1990లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 108 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత నుంచి ప్రాంతీయ పార్టీల హవా మొదలుకావడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది. కాగా, బీజేపీ కొద్దిరోజులు మాత్రమే సెంచరీ మార్క్‌ను నిలబెట్టుకునే అవకాశముంది. ఎందుకంటే త్వరలో మరో 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ సహా రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా స్కోప్ లేదు. కాబట్టి వంద మార్క్‌ను నిలుపుకోవడం కష్టమే. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీకానున్న 11 స్థానాల్లో ఎనిమిదింటిని బీజేపీ గెలుచుకునే అవకాశముంది. యూపీ నుంచి రిటైర్ అవుతున్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.
పెద్దల సభలో బీజేపీ బలం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో బిల్లులను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆమోదించుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపు సులువు అవుతుంది. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్)
Comments
Please login to add a commentAdd a comment