సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుపై బీజేపీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కచ్చి తంగా పది గెలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న కీలక సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఎన్నికల కసరత్తు నిమిత్తం 10 కమిటీలను నియమించనుండగా, రాష్ట్ర పార్టీ ఆ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీల నియామకానికి ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది.
కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికల కమిటీ
ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా జి.కిషన్‌రెడ్డి నియమితులు కాగా, సభ్యులుగా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జి అర్వింద్ మీనన్, డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా మొత్తం 13 మందిని నియమించినట్టు సమాచారం. శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ సమన్వయకర్తగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇన్‌చార్జిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర కమిటీతో పాటు కొత్త ఓటర్లతో సమ్మేళన కమిటీకు కార్యదర్శిగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీకి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా.ఎస్.ప్రకాష్రెడ్డి, హర్‌గావ్ జానా (ప్రతీ గ్రామాన్ని సందర్శించే)కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించినట్టు
తెలుస్తోంది.
చేరికల కమిటీలో ఆ ముగ్గురూ!
పార్టీ చేరికల కమిటీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ పొంగులేటి సుధాకరరెడ్డి సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల చైర్మన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని (అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన త్రిపుర గవర్నర్‌గా నియామకం) నియమించగా ఆ బాధ్యతల నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈటలకు బాధ్యతలు అప్పగించగా, ఇప్పుడు ముగ్గురితో కలిసి చేరికల కమిటీని నియమించినట్టు పార్టీ నాయకుల సమాచారం.
టార్గెట్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేంద్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పాత్ర పరిమితం కాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి పెద్దగా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు లేనందున కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment