ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనే లేదు. అయితేనేం ఈలోపే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి సర్‌ప్రైజ్ చేసింది బీజేపీ. పైగా రిజర్వ్‌డ్‌సీట్లు.. గతంలో ఎన్నడూ గెలవని సీట్లకు ముందుగా అభ్యర్థులను ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురి చేయించిందనే చెప్పాలి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని కమలం ఫాలో అవుతోందా?..
ఎన్నికలకు వంద రోజుల ముందుగానే అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ నుంచి ఊహించని పరిణామం. అందునా షెడ్యూల్ రాకముందు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ మల్లాగుల్లాలు పడడం గమనార్హం. ఈ క్రమంలో కష్టతరమైన నియోజకవర్గాల జాబితాను విడుదల చేయడం ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతాలు పంపిందనేది విశ్లేషిస్తే.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటక వ్యూహం కనిపించకమానదు!.
కర్ణాటకలో ఇలా..
కర్ణాటకలో అభ్యర్థులను ఎన్నికలకు ముందుగానే ప్రకటించి సక్సెస్ అయ్యింది కాంగ్రెస్. పేర్లు ప్రకటించిన వెంటనే క్షేత్ర స్థాయిలోకి దిగిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకున్నారు. తాము అందించబోయే సంక్షేమం గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టైం దొరికింది. తద్వారా బలంగా దూసుకుపోయి.. ఓట్లు రాబట్టుకోగలిగారు. సరిగ్గా.. అలాంటి ప్రణాళికే ఇప్పుడు బీజేపీ ఛత్తీస్‌గఢ్, అధికార మధ్యప్రదేశ్ విషయంలోనూ అనుసరిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను, ఛత్తీస్‌ఘడ్‌లో 21 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వీటిలో ఎక్కువగా రిజర్వ్‌డ్ సీట్లుకాగా, మరికొన్ని బీజేపీ గతంలో ఎన్నడూ గెలవని సీట్లు. తద్వారా గెలుపు కఠినమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు వీలుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. నిజానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బిజెపి పరిస్థితి బాగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉండగా, ఛత్తీస్‌ఘడ్‌లో ప్రతిపక్షంలో ఉంది. అయితే కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టింది. అందుకే.. అదే ఫార్ములాను బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ సంగతేంది?
నిజానికి ఈ కసరత్తు తెలంగాణలో జరగాలి. ఎందుకంటే, తెలంగాణలోనే బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పైగా.. ఇటీవలి సర్వేలన్నీ బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావొచ్చనే అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. వంద రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే..
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లో(ముందస్తు) బీజేపీ దాదాపు వందస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.
- హేమాహేమీలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారే ఓటమి పాలయ్యారు.
- కేవలం ఒక్క సీటుకే బిజెపి పరిమితమైంది.
అలాంటప్పుడు.. గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే.. ఎన్నికల సన్నాహానికి.. ప్రచారానికి తగిన సమయం దొరికడంతో పాటు అన్నిరకాల వనరులు సమకూర్చుకునే వీలు కలిగేది కదా అనే అభిప్రాయాన్ని పార్టీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది.
ఆగుదాం.. వెతుకుదాం!
తెలంగాణలో మాత్రం మరో తరహా ఫార్ములాతో బీజేపీ ముందుకుపోయేలా కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఇటీవల చేసిన మార్పులతో తెలంగాణ పార్టీ కేడర్‌లో జోష్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బండి సంజయ్ లాంటి డైనమిక్ నేతను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడాన్ని ఇప్పటికీ ఆయన వర్గీయులు, పార్టీ శ్రేణి చాలా మట్టుకు జీర్ణించుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకనో.. తిరిగి జోష్ తీసుకువచ్చేందుకు అధిష్టానం నుంచి పెద్దగా ప్రయత్నం కనిపించడం లేదు. ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో అభ్యర్థుల ఎంపికపై వంద రోజుల ముందే దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు తెలంగాణపై ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అప్పుడే ప్రకటన!
బీజేపీకి 35 చోట్ల మినహా మిగిలిన చోట్ల పెద్దగా పోటీ ఇచ్చే నాయకుల లేరట. అందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జాబితాల ప్రకటన తర్వాత గానీ బీజేపీ తన లిస్ట్ ప్రకటించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ లోపు.. గెలుపు గుర్రాల కోసం తాము అన్వేషిస్తున్నామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment