రాష్ట్ర బీజేపీలో ఎనిమిది నెలలుగా లోపించిన జోష్
8 మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా పార్లమెంటు, అసెంబ్లీలో కానరాని ప్రభావం
పార్టీ పటిష్టత కోసం చురుగ్గా పనిచేయట్లేదని కేడర్‌లో నిరాశ
పార్టీ రాష్ట్ర శాఖతో ప్రజా ప్రతినిధులకు సంబంధాలు కొరవడ్డట్లు అనుమానం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు గురించి ఎవరూ మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు నేతల హుకుం?
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు లేదా నిధులు తేవడంలో ఎంపీలు విఫలమయ్యారని విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో స్తబ్దత నెలకొంది. గత ఎనిమిది నెలలుగా పార్టీలో జోష్ లోపించింది. ఇప్పటికే ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి కొనసాగుతుండగా దీనికితోడు పార్టీ విస్తరణ, పటిష్టత కోసం ఎవరూ చురుగ్గా వ్యవహరించడంలేదంటూ కేడర్‌లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎనిమిది మంది చొప్పున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో పార్టీ ఎంపీలు తెలంగాణకు జాతీయ ఏదైనా ప్రాజెక్టు లేదా ప్రత్యేక నిధులు సాధించడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో విమర్శిస్తున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర శాఖకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా అనే సందేహం పార్టీ వర్గాల్లో నెలకొంది.
సొంత ఇమేజీ పెంచుకోవడంపైనే...
ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే అధిక దృష్టి పెడుతున్నారన్న విమర్శలు కూడా అంతర్గతంగా పారీ్టలో వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం వారికి సరిగ్గా దిశానిర్దేశం చేయలేకపోవడానికి గల కారణాలు ఏమిటనే చర్చ కూడా కేడర్‌లో నడుస్తోంది. ప్రధానంగా సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పును బీజేపీ అనుకూలంగా మలుచుకోలేకపోవడంపైనా సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ అంశంపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఎమ్మెల్యేలను సైతం ముఖ్యనేతలు ఆదేశించడంతో రాష్ట్ర పార్టీ నుంచి ఎవరూ స్పందించని పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయంపై కనీసం ఎమ్మార్పీఎస్ ద్వారానైనా సంబరాలు చేయించి ప్రధాని మోదీకి, బీజేపీకి క్రెడిట్ దక్కేలా చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ తూతూమంత్రంగా అమలు చేస్తోందని విమర్శించిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి... పార్టీ రాష్ట్రకార్యాలయంలో దీనిపై హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్ర చేశారు.
అయితే ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది పార్టీ రాష్ట్రశాఖకు, బీజేఎలీ్పకి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టింది.
క్రియాశీలం కాని పార్టీ వ్యవస్థ...
బీజేపీ రాష్ట్ర శాఖకు మొత్తం ఐదుగురు ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత బాధ్యతలు కలిపి), పెద్ద సంఖ్యలో కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర వ్యవస్థ ఉంది. అయితే వారంతా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ, విభాగాల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళిక తదితరాలపై అంటీముట్టనట్టుగా, మొక్కుబడిగా పనిచేస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని ఎలా నెరవేరుస్తుందన్న అనుమానాలు కేడర్‌లో వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment