హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ కంచు కోటగా ఉంది. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్‌ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో 'కొంపెల్ల మాధవి లత'ను (Kompella Madhavi Latha) హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకీ ఈమె ఎవరనేది ఈ కథనంలో చూసేద్దాం..
కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.
హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం.
లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికి సుపరిచమైంది.
ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment