ఆదిలాబాద్ బీజేపీ సమావేశంలో మాట్లాడుతున్న మురళీధర్‌రావు, పక్కన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేశ్
గతంలో ఆయన మాట్లాడినట్లే రేవంత్ కూడా మాట్లాడుతున్నారు: బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గతే పడుతుందని బీజేపీ జాతీయ నాయకుడు పార్టీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ పి.ము రళీధర్‌రావు హెచ్చరించారు. గతంలో కేసీఆర్ మాట్లాడినట్లే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చాలా తక్కువ సమయంలోనే సీఎం పదవిని కోల్పోతారన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం సెంటర్ అయిందని, ఇక్కడి నుంచి పంపించిన 2 వేల కోట్ల రూపాయలనే పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తోందని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో ప్రవేశించేందుకు హస్తం పార్టీకి గ్యారంటీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే పనికి రాకుండా పోతుందని చెప్పారు. దేశం నడవాలంటే స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలని అందుకు మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుస్తుందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక వేళ గెలుచుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.
సీఎం రేవంత్‌రెడ్డి సెటిల్మెంట్ల కోసమే పదవిలో కూర్చున్నారని వాటికి సంబంధించి ఆధారాలతో నిరూ పిస్తానని..బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment