వచ్చేది మేమే.. | BJP Leaders Amit Shah Fires On CM KCR | Sakshi
Sakshi News home page

వచ్చేది మేమే..

Published Mon, Aug 28 2023 1:39 AM | Last Updated on Tue, Aug 29 2023 6:28 PM

BJP Leaders Amit Shah Fires On CM KCR - Sakshi

ఖమ్మంలో బీజేపీ సభకు హాజరైన ప్రజలు, ఆదివారం ఖమ్మం సభలో అమిత్‌ షా.

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రైతు, దళిత, యువత, మహి­ళా వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తెద్దాం. గుర్తుపెట్టుకో కేసీఆర్‌.. నీ పనైపోయింది. నువ్వు కానీ, నీ కొడుకు కానీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు..’ అని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా అన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ వంశపారంపర్య 4జీ పార్టీ. బీఆర్‌ఎస్‌ కేసీఆర్, కేటీఆర్‌ 2జీ పార్టీ.

ఇక మజ్లిస్‌ 3జీ పార్టీ. ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లింది. బీజేపీ ప్రజల పార్టీ. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..’ అని స్పష్టం చేశారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడంతో పాటు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘రైతుగోస–­బీ­జేపీ భరోసా’ సభకు ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు.

‘తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఖమ్మంలో స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామికి నమస్కారం. తెలంగాణ విమోచన కోసం పోరాడిన ఖమ్మం వాసి జమలాపురం కేశవరావుకు నివాళులు..’ అంటూ ఆయన తన ఉపన్యాసం ప్రారంభించారు. అమిత్‌షా హిందీలో చేసిన ప్రసంగాన్ని పార్టీ నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలుగులోకి అనువదించారు. 

కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం
‘తెలంగాణలో అక్రమ, అవినీతి కుటుంబ పాలకులు రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్నారు. తెలంగాణ కోసం యువత ప్రాణత్యాగం చేసింది. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా రజాకార్ల పార్టీ ఎంఐఎంతో అంటకాగుతోంది. ఫలితంగా నాటి ప్రజల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. ఎన్నికలు వస్తున్నాయి.. కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది..కేసీఆర్‌ తప్పకుండా ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది..’ అని అమిత్‌షా దీమా వ్యక్తం చేశారు. 

రాముడికి వస్త్రాలను విస్మరించారు..
‘భద్రాచలానికి దక్షిణ భారత అయోధ్యగా పేరుంది. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం తరఫున శ్రీరామనవమి సందర్భంగా రాముడికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్‌ ప్రభుత్వంలో మాత్రం.. కారు భద్రాచలం వరకు వస్తున్నా మందిరంలోకి వెళ్లకుండా ఆగుతోంది.

కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతిలో ఉండటమే ఇందుకు కారణం. మిత్రుడికి బాధ కలుగుతుందనేది కేసీఆర్‌ ఆలోచన. కానీ కేసీఆర్‌ పని అయిపోయింది. బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరైనా కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మాల ముందు అర్పిస్తాం. కేసీఆర్‌ ఇక భద్రాచలానికి రావాల్సిన అవసరం లేదు. స్టీరింగ్‌ చేతుల్లోలేని కేసీఆర్‌ కారు మనకు అవసరం లేదు..’ అని అన్నారు.

బెదిరింపులకు వెనక్కు తగ్గం..
‘బీజేపీ నేతలపై దౌర్జన్యాలు చేసి అక్రమ నిర్బంధాలు విధిస్తే, బెదిరింపులకు గురిచేస్తే వారు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. మా కిషన్‌రెడ్డి, మా బండి సంజయ్, మా ఈటల రాజేందర్‌ను అడ్డుకుంటే మేం వెనక్కు తగ్గం. పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, దళితులకు ఆర్థికంగా భరోసా ఇస్తామన్నారు. రైతులకు మరో హామీ ఇచ్చారు.

ఇలా అబద్ధపు హామీలు ఇస్తూ కేసీఆర్‌ కాలం వెళ్లదీస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే అని అంటున్నాడు. కానీ ఓవైసీ, కేసీఆర్‌తో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు. ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదు..’ అని అమిత్‌షా స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్‌ రాజకీయం..
కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. మేము ఒక్క తెలంగాణకే తొమ్మిదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ప్రధాని మోదీ 33 లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించారు. 1.90 కోట్ల మంది పేదలకు నెలకు ఐదు కిలోల ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. 11 లక్షల మందికి ఉజ్వల్‌ పథకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చాం. 2.5 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాం.

ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రైతుల కోసం రూ.22 వేల కోట్ల బడ్జెట్‌ పెడితే.. ఇవాళ మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ రూ.1.25 లక్షల కోట్ల బడ్జెట్‌ ఇచ్చింది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం రూ.7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తోంది. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ధాన్యం కొనుగోళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వమే తెలంగాణలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించింది. పంటల కనీస మద్దతు ధరను మా ప్రభుత్వం 65 శాతం పెంచింది. దేశంలో 11 కోట్ల మంది రైతులకు రూ.2.60 లక్షల కోట్ల కిసాన్‌ సమృద్ధి నిధిని అందిస్తోంది..’ అని షా తెలిపారు. 

విల్లు ఎక్కుపెట్టి..
అమిత్‌షా సభావేదిక పైకి రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలు బంగారు వర్ణంలో ఉన్న బాణం, విల్లును అందజేయడంతో ఆయన వాటిని ఎక్కు పెట్టారు. అలాగే నేతలు నాగలిని కూడా బహూకరించి, సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం గజమాలతో సన్మానించారు. కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ వేదికపైకి ఎక్కి పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్నప్పుడు, వారు మాట్లాడుతున్నంత సేపు సభికుల నినాదాల హోరు మిన్నంటింది.

ఈ సభలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సాల్, మరో ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతలు గరికపాటి మోహన్‌రావు, బంగారు శృతి, ఇంద్రసేనారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, మురళీధర్‌రావు, సోయం బాబూరావు, రఘునందన్‌రావు, వివేక్‌ వెంకటస్వామి తదితరులు కూడా హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement