న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకునేలా లేదు. ఢిల్లీ పీఠంపై ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా పార్టీ వీడిన సొంత పార్టీ నేతలను, ఎన్డీఏ కూటమి పాత మిత్రులను మళ్లీ దగ్గరకు తీస్తోంది. ఎవరినీ కాదనడం ఉండదని పార్టీ తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయని బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే ఎన్నికలకు ఎంత వీలైతే అంత బలంగా వెళ్లేందుకు కాషాయ పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది.
బీహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీఏలోకి రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్‌కుమార్ తిరిగి బీజేపీతో జట్టుకట్టడం కొత్తగా ఏర్పడిన ఆ కూటమికి పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ ఎన్డీఏతో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇండియా కూటమిలో మిగిలే కీలక పార్టీలేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఇప్పటికే ఆప్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్లే దిశగా సంకేతాలిస్తున్న విషయం తెలిసిందే.
ఇక గతంలో ఎన్డీఏతో ఉండి బయటికి వెళ్లిన టీడీపీ, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ముందు తిరిగి కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు కర్ణాటకలో బీజేపీ పాత మిత్రుడు జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)చీఫ్ ఇప్పటికే బీజేపీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే వివిధ కారణాల వల్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సావడి, గాలి జనార్ధన్‌రెడ్డి లాంటి ముఖ్య నేతలను పార్టీలోకి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకుంటూనే ఎన్డీఏను వీడిన పాత మిత్రులను తిరిగి కలుపుకొని కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడిందని పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం బీజేపీ వ్యూహంలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే ఎన్డీఏ 2019 సాధారణ ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేపట్టడం ఖాయమని పొలిటికల్ పండిట్లు లెక్కలు కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment