BRS అధ్యక్షుడు KCR మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్ చేస్తున్న మొదటిసారి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఅర్ఎస్, బిజెపి ల మద్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగినా.. పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్‌తో పాటు BRS పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు.!
ఢిల్లీలో కెసిఆర్ రాజకీయ చర్చల కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. "మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా? బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు? బీఆర్‌ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీ." అన్నారు బాల్క సుమన్.
పొత్తు ఊహగానాలకు అవకాశమిచ్చిందెవరు?
సాధారణంగా బీఆర్‌ఎస్, బీజేపీ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీఆర్‌ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. దానికి కొనసాగింపుగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. అలాగే ఎంపీ బండి సంజయ్ కూడా ఇదే అంశంపై ప్రకటన చేశాడు.
ఇటీవల మల్లారెడ్డి ఏమన్నాడంటే..
"బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేదు" అన్నారు మల్లారెడ్డి.
మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుపై మల్లారెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ఏమన్నాడంటే.. "ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు" అని స్పష్టం చేశారు. "బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్‌ఎస్‌ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది?
మొత్తం 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30, 2023న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64, దాని మిత్రపక్షం సిపిఐకి 1, బీఆర్‌ఎస్‌కు 39 సీట్లు రాగా, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు నెలల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సారి పార్లమెంటు ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణంలో మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment