‘హరీష్‌ నామినేషన్‌ ఏమైంది?’.. పీఏసీ భేటీలో గందరగోళం​ | BRS Members Walk Out On Telangana PAC Meeting In Assembly | Sakshi
Sakshi News home page

పీఏసీ సమావేశంలో గందరగోళం.. బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌

Published Sat, Sep 21 2024 12:54 PM | Last Updated on Sat, Sep 21 2024 3:18 PM

BRS Members Walk Out On Telangana PAC Meeting In Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. అనంతరం, బీఆర్‌ఎస్‌ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

కాగా, పీఏసీ చైర్మన్‌ గాంధీ అధ్యక్షతన నేడు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామరావు పవార్, బీఆర్‌ఎస్‌ నుంచి పశ్రాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాద్ రావు, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే, పీఏసీకి ఎన్ని నామినేషన్లను వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం, సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మా ప్రశ్నలకు పీఏసీలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే వాకౌట్‌ చేశాం. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబే మాట్లాడుతున్నాడు. వాళ్ల తప్పుడు పనులు మేము బయటపెడతామని భయపడుతున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉంటే మా ఎల్పీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ చైర్మన్‌ ఇచ్చారు.

గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది. ఆయన ఎంపిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా.. సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది మాకు తెలియాలి. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సభ్యుల సంఖ్య ప్రకారం ఐదుగురి పేర్లు ఇవ్వమన్నారు. ఐదుగురి పేర్లు ఇచ్చాం. కానీ, అందులో గాంధీ పేరు లేదు. అయినప్పటికీ గాంధీకి ఎలా పదవి ఇచ్చారు.

2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్‌ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ చైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ..‘నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది మా వాదన. ఎజెండా ఏంటో ఇంకా చూడలేదు.. ఆలోపే వాకౌట్‌ చేశాం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. మొదట పార్టీ మారిన ముగ్గురిపై కేసు వేశాం. మిగతా వారిని ఇంప్లీడ్ చేస్తాం. స్పీకర్ తీర్పును న్యాయ సమీక్ష చేస్తామని హైకోర్టు చెప్పింది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: అమృత్ టెండర్లలో సీఎం రేవంత్‌ కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement