సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.
ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను.
డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment