మళ్లీ ఉద్యమం తరహా వ్యూహాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పదును
కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామనే భావన
జనం స్పందనకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ
బీజేపీ వైపు జనం మొగ్గుచూపడం లేదనే అభిప్రాయం
అసెంబ్లీ స్పీకర్‌పై అవసరమైతే వాయిదా తీర్మానం
ఫిబ్రవరి నెలాఖరులో పార్టీ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ
వచ్చే ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయం
ప్రెస్‌మీట్లు, ప్రకటనలే కాకుండా..జనంలోకి నేరుగా వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇకపై దూకుడుగా పోరాటాలు చేపట్టా లని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కుదురుకుని పనిచేసేందుకు సరిపడా సమయం ఇచ్చా మని భావిస్తోంది. ఇక ముందు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని.. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. బీఆర్‌ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను, ప్రజలను భాగస్వాములను చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీరుపై ‘మిలిటెంట్ తరహా దూకుడు పోరాటాలు చేయాల’ని ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో సూచించినట్టు తెలిసింది.
పార్టీ విధానాలపై ఫోకస్..
కాంగ్రెస్ విధానాలను నిరంతరం విమర్శించడం వల్ల అధికారం కోల్పోయానే బాధతో విమర్శలు చేస్తున్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దూరదృష్టితో పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు వెనుక ఉన్న తాతి్వకతను కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించినట్టు సమా చారం.
‘‘హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇక్కడి ఆర్థిక పటిష్టతను ప్రజలకు చాటి చెప్పాం. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ చేశాం. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో, బయటా పార్టీ నేతలు విడమరిచి చెప్పాలి..’’అని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.
ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేవలం ప్రెస్‌మీట్లు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా... సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తు న్న ప్రజా వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఏమీ మారడం లేదని, దీనిని బీఆర్‌ఎస్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం.
అసెంబ్లీ వేదికగా ఒత్తిడి పెంచి..: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. తొలిరోజున అదానీ–రేవంత్ దోస్తీ అంటూ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. సభ జరిగే మిగతా రోజుల్లోనూ ఏదో ఒకరకమైన వ్యూహంతో అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని నిర్ణయానికి వచి్చ నట్టు తెలిసింది.
పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ వాయిదా తీర్మానం ఇవ్వడం, లేదా స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలకు అసెంబ్లీతో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనా ఎలాంటి చర్చల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సంస్థాగత అంశాలపై ఫోకస్..
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హైదరాబాద్, వరంగల్‌లలో కాకుండా అన్ని జిల్లాలనుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యమకాలంలో నిర్వహించిన తరహాలో భారీ జనసమీకరణతో పార్టీ సత్తా చాటేలా సభ ఉంటుందని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.
ఇక వచ్చే ఏడాది పొడవునా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. యువత, మహిళలకు చేరువ కావడం లక్ష్యంగా కార్యక్రమాలనిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment