సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దొంగ అగ్రిమెంట్లు, డొల్ల కంపెనీలతో దోచుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, జీఎస్టీ, ఈడీల విచారణలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా, తరువాత ఐటీ శాఖ దాడుల్లో కూడా చంద్రబాబు అక్రమాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. వీటి ఆధారంగా సీఐడీ విచారించడంతో చంద్రబాబు పాత్రతో సహా మరిన్ని అంశాలు తేలాయన్నారు.
నాలుగైదేళ్లు విచారణ అనంతరం పలువురు సాక్షులను ప్రశ్నించి పత్రాలను పరిశీలించాక ఆధారాలు లభించడంతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేసిన చంద్రబాబును అరెస్టు చేయకుండా సన్మానం చేయమంటారా? అని నిలదీశారు. స్కిల్ స్కామ్‌పై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిస్తూ అన్ని అంశాలను కూలంకషంగా సభకు వివరించారు.
హడావుడిగా కార్పొరేషన్.. డొల్ల కంపెనీలకు డబ్బులు
చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే వీలైనంత వేగంగా ప్రజాధనాన్ని దోచేసేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 2015 ఫిబ్రవరి 25న స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్టుమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్కిల్ శిక్షణ ఉన్నత విద్యలో భాగంగా ఉండగా దాన్ని వేరుచేసి స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్‌గా విభజించారు. తరువాత జర్మనీకి చెందిన సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో నైపుణ్య శిక్షణ అంటూ జీవో నెం 4 ఇచ్చారు. దానికి భిన్నంగా డిజైన్‌టెక్ అనే షెల్ కంపెనీని తెచ్చి ఒప్పందం చేసుకున్నారు.
దొంగ సంతకాలు, తేదీలు వేయకుండా జరిగిన ఈ ఎంఓయూ పూర్తిగా అక్రమమే. ఆరు క్లస్టర్లుగా ఒక్కోదాని పరిధిలోని 5 ఇన్‌స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో క్లస్టర్‌కు అయ్యే ఖర్చు రూ.546 కోట్లుగా చూపించి అందులో 90 శాతం సీమెన్స్ సంస్థ భరిస్తుందని, 10 శాతం నిధులను ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తుందని జీవోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ జీవో, ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఒకవేళ ఎవరైనా ఎంఓయూ చేసుకుని ఉంటే తమకు సంబంధం లేదని సీమెన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆరు క్లస్టర్లకు రూ.3,281 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు.
ఈ ప్రాజెక్టు నివేదిక కూడా పూర్తిగా బోగస్. తమకు తెలియకుండా ఇండియాలో తమ ఎండీ నాటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీమెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో తేలింది. దీంతో ఆ ఎండీని తొలగించినట్లు సీమెన్స్ కంపెనీ లిఖితపూర్వకంగా వెల్లడించింది. అదే విషయాన్ని సీమెన్స్ లీగల్ హెడ్ న్యాయస్థానంలో 164 సెక్షన్ కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇంత జరిగినా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు.
ఇంకా కళ్లు మూసుకుని ఉండాలా?
పలు అరెస్టులు జరిగిన ఈ అంశంలో విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా? ఈడీ విచారించిన నిందితులే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లోనూ ఉన్నారు. సీమెన్స్ ఇండియా తరఫున గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని సౌమ్యాద్రి శేఖర్ బోస్‌గా సంతకం చేసిన వ్యక్తి ఏపీకి వచ్చేసరికి ఎంఓయూలో సుమన్ బోస్‌గా సంతకం చేశారు. అతడితోపాటు డిజైన్‌టెక్ తరఫున సంతకం చేసిన కన్విల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ తరఫున ఒప్పందం చేసుకున్న చంద్ర అగర్వాల్, పేమెంటు తీసుకున్న సురేష్ గోయెల్‌ను ఈడీ గతంలో అరెస్టు చేసింది.
ఇంతమందిని ఈడీ అరెస్టు చేసినా మనం కళ్లు మూసుకొని ఉండాలా? అక్రమాలను గుర్తించిన జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం సుమన్‌బోస్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఈ కుంభకోణంపై సీఐడీ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించింది. అనేక అక్రమాలు జరిగినట్లు అందులో తేలింది. ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుండడంతో టీడీపీ వాళ్లు కక్ష సాధిస్తున్నారంటున్నారు. తప్పు జరగలేదని చెప్పట్లేదు.
కార్పొరేషన్ ఏర్పాటే ఒక దుష్ట పన్నాగం
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఎంతో హడావుడిగా విధి విధానాలు లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి కావాలని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ కల్లం స్పష్టంగా రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమకు నచ్చిన వ్యక్తులను తెచ్చి ఇంత ముఖ్యమైన సంస్థలో కీలక పోస్టుల్లో నియమించారు. గంటా సుబ్బారావును ఎండీ, సీఈఓగా నియమించారు. తరువాత అదే వ్యక్తిని ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు సీఎం, హయ్యర్ ఎడ్యుకేషన్‌గా నియమించారు.
సెక్రటరీ టు స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్ బాధ్యతలూ అప్పగించారు. అన్ని హోదాల్లో ఒకే వ్యక్తిని నియమించుకున్నారు. నైపుణ్య శిక్షణ పేరిట రూ.371 కోట్లను త్వరగా కొట్టేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. 90 శాతం గ్రాంటు వస్తుందని జీఓలో చెప్పి ఎంఓయూలో దాని ఊసే లేకుండా చేశారు. ప్రభుత్వం నుంచి హడావుడిగా నిధులు విడుదల చేశారు. టెండర్లకు వెళ్లకుండా డబ్బులు కాజేసేందుకు పథకం ప్రకారం వ్యవహరించారు.
డిజిటల్ ఫైల్స్ లేకుండా..
ఈ శిక్షణ వ్యవహారంలో గత ప్రభుత్వం ఏ ఒక్క ప్రొసీజర్‌ను కూడా అనుసరించలేదు. డిజిటల్ ఫైల్సు లేకుండా ఫిజికల్ ఫైల్స్‌తోనే తతంగం నడిపించారు. కొత్త ప్రాజెక్టు కనుక ఒకేసారి కాకుండా పైలట్‌గా చేపట్టాలని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత సూచించినా పట్టించుకోలేదు.
ముందుగానే రూ.371 కోట్లు ఎలా విడుదల చేస్తారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సీఎస్ కృష్ణారావు, ఇతర అధికారులు కూడా నిధుల విడుదలపై కొన్ని అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసేశారు. ఇవన్నీ నాటి సీఎం పాత్ర లేకుండా జరుగుతాయా? శ్రీనివాస్, పార్థసానిలను విచారిస్తే ఈ డబ్బులు ఎవరిదగ్గరకు చేరాయో తేలుతుంది.
జీఎస్టీ డీజీ విచారణతో వెలుగులోకి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారంతో 2017 ఆగస్టులో మొదటిసారిగా జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (పుణే) డొల్ల కంపెనీలను విచారిస్తున్న సమయంలో కొన్ని బోగస్‌వి దొరికాయి. ఆ డొల్ల కంపెనీలకు డబ్బులు చేరవేసి అక్కడినుంచి వేరే సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి మళ్లించినట్లు జీఎస్టీ విచారణలో తేలింది. దీంతో అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏషియా లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ (పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్), డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు జీఎస్టీ డీజీ నోటీసులు ఇచ్చారు.
చంద్రబాబు ఈ సంస్థలతోనే ఎంఓయూ కుదుర్చుకున్నారు. జీఎస్టీ డీజీ విచారణలో అక్రమాలు బయటపడిన తరువాత, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా విచారణ జరిపారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై జీఎస్టీ అధికారులు నాటి టీడీపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టాల్సిన గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోగా అవినీతికి కీలకమైన ఫైళ్ల నుంచి నోట్ ఫైళ్లను మాయం చేసింది. ఆ తరువాత ఓ విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో గత సర్కారు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సీఐడీ విచారణతో మొత్తం అక్రమాలు బయటకు వస్తున్నాయి.
పలు డొల్ల కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని తరలించినట్లు తేటతెల్లమైంది. ప్రాథమిక విచారణ చేశాక 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత కొంతమందిని విచారించి అరెస్టు కూడా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, సురేష్ గోయెల్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), మనోజ్‌కుమార్ జైన్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), యోగేష్ గుప్తా (షేర్స్ ట్రేడింగ్ బిజినెస్) శ్రావణ్‌కుమార్ తులరాంజాజు (షేర్ ట్రేడింగ్ బిజినెస్)లను అరెస్టు చేశారు.
2017 నుంచి 2023 వరకు సెబీ, జీఎస్టీ ఇంటెలిజెన్సు, ఐటీ, ఈడీలు విచారించాయి. ఈడీ కూడా సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినయ్ కన్విల్కర్, ముకుల్‌చంద్ అగర్వాల్, సిరీస్ చంద్రకాంత్‌ఝా, బిపన్కుమార్శర్మ, నీలన్‌శర్మ, గంటి వెంకటసత్య భాస్కర్ ప్రసాద్, వీరందరినీ విచారించి అరెస్టు చేసింది.
ఒప్పందం తరువాత షెల్ కంపెనీల ఏర్పాటు
ఇక డబ్బుల చెల్లింపులు చూస్తే గత ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచేయడానికి ఎంత ఆరాటపడ్డారో అర్థమవుతుంది. ఒప్పందం కుదిరిన కొద్దిరోజులకే 2015 డిసెంబర్ 5న అప్పటికప్పుడు రూ.185 కోట్లు విడుదల చేశారు. 2016 జనవరి 29న మళ్లీ అర్జెంటుగా రూ.85 కోట్లు, 2016 మార్చి 11న రూ.67 కోట్లు, మార్చి 31న రూ.34 కోట్లు.. ఇలా మొత్తం నిధులను విడుదల చేశారు. విచిత్రమేమంటే క్లస్టర్లేవీ ఏర్పాటు కాకుండానే నిధులను ఇచ్చేశారు. స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కొన్ని కంపెనీలను ఎంఓయూ కుదిరిన నెలరోజుల తరువాత ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులను తరలించేశారు. స్కిల్లర్ కంపెనీ అనేది డొల్ల కంపెనీ అని, కేవలం డబ్బులు కాజేయటానికే దాన్ని ఏర్పాటు చేశారని సీఐడీ తేల్చింది.
ముందుగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి నేరుగా డిజైన్ టెక్‌కు రూ.273.21 కోట్లను తరలించి అక్కడి నుంచి డొల్ల కంపెనీల ద్వారా వేర్వేరు మార్గాల్లో నిధులను దోపిడీ చేశారు. పీవీఎస్పీ, స్కిల్లర్ ఇండియా, ఏసీఐ, క్యాడన్స్, పొలారస్, నాలెడ్జి పోడియం, ఈటీఐ, పాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్ సహా వివిధ ఫారెన్ కంపెనీల ద్వారా ఈ నిధులను కొల్లగొట్టారు. యోగేష్‌గుప్తా డొల్ల కంపెనీలలో భాగస్వామిగా తేలాడు. అతడు చంద్రబాబుకు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ స్కామ్‌లో నిందితుడు. ఈ స్కామ్‌లో మనోజ్ వాసుదేవ్ పార్థసానిని విచారిస్తే మంగేష్, అతుల్సోని వినయ్ అనే వ్యక్తులు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందించారని ఐటీ శాఖ తేల్చింది.
ఇదంతా చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా నడిచింది. విక్కీజైన్ అనే వ్యక్తిని శ్రీనివాస్ తమకు అటాచ్ చేయడంతో డబ్బులు పంపినట్లు వారు ఐటీ శాఖకు వెల్లడించారు. ఈ స్కామ్‌లో రామోజీరావు వియ్యంకుడు ఆర్వీఆర్ రఘు కూడా ఉన్నాడు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలను విచారించడానికి సీఐడీ 2023 సెప్టెంబర్ 5న నోటీసులు ఇవ్వగా వారిద్దరు ఆ మర్నాడే విదేశాలకు పరారయ్యారు.
చిత్ర విచిత్రాలు
సీఐడీ పరిశోధనల్లో అనేక అవకతవకలు బయట పడ్డాయి. సౌమ్యాద్రి బోస్ అనే వ్యక్తి సీమెన్సు ఇండియా సాఫ్ట్‌వేర్‌కు ఎండీగా ఉన్నాడు. గుజరాత్‌తో చేసుకున్న ఎంఓయూలో సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసి మన దగ్గరకు వచ్చేసరికి సుమన్ బోస్‌గా పేరు మార్చేసి సంతకం చేశాడు. కంపెనీలో ఎండీగా ఉంటూ వేర్వేరు పేర్లతో సంతకాలు పెట్టడమన్నది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అగ్రిమెంట్ జూన్ 2015 అని పేర్కొని ఎక్కడా తేదీ వేయలేదు. తేదీ లేకుండా అగ్రిమెంట్ ఎక్కడైనా చూశామా? పేజీ చివర్లో సీమెన్స్ ఇండియా లిమిటెడ్, డిజైన్ టెక్ ఇండియా లిమిటెడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం చేసుకున్నట్లు ఉన్నా తేదీలు వేయలేదు. ‘డాష్..’ అంటూ ఖాళీలు ఉంచారు.
సాక్షి సంతకాల వద్ద కూడా ఖాళీ ఉంచారు. ఎంఓయూలో డిజైన్‌టెక్ ద్వారా అమలు చేస్తునట్లు చూపించి తరువాత మూడో పార్టీగా పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రైవేటు లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలను తెరపైకి తెచ్చారు. జీఓలో సీమెన్సు అమలు చేయాలని పేర్కొని ఒప్పందంలో డిజైన్‌టెక్‌కు పరిమితం చేసి చివరకు స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగిస్తున్నట్లు చూపించారు. అసలు డిజైన్‌టెక్కే ఓ డొల్ల కంపెనీ. అది మరో డొల్ల కంపెనీకి ఇచ్చేసింది.
ఉపసంహరించుకోవడానికి మనమెవరం?
ప్రతిపక్ష సభ్యులు ఈ శాసనసభలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపసంహరించుకోవడానికి మనమెవరం? కోర్టు, చట్టం తమ పని తాము చేస్తున్నాయి. విపక్ష సభ్యులకు వారికి కేటాయించిన సమయం కన్నా ఎక్కువ ఇస్తామని, ప్రభుత్వం సమాధానమిస్తుందని చెబుతున్నా వినకుండా వెళ్లిపోయారు. విజిల్ వేసిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మిగతా వారు కూడా వెళ్లిపోయారంటే చర్చించాలని వారికి ఏ కోశానా లేదు. చంద్రబాబు లాంటి మహా మేధావి ఎక్కడా దొరకడని వారి అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment