ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
నామినేషన్‌లన్నీ స్క్రూటినీ చేశాకే పీఏసీ పదవికి అరికెపూడి గాంధీ ఎంపిక
గతంలో అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పీకర్ విచక్షణాధికారం అన్నదెవరు?
బతకడానికి వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సమాధానం చెప్పాలి
ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటే తమకే మేలని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముమ్మాటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పీఏసీ పదవి కట్టబెట్టామని తేల్చిచెప్పారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోలు నియామకాలు చేసింది బీఆర్‌ఎస్ కాదా అని విరుచుకుపడ్డారు. ‘అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆరోజు బీఆర్‌ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
మా సంఖ్య 38 కాదు.. 28 మాత్రమే అని వాళ్లు అనలేదు. అలాంటప్పుడు అనర్హత అనే అంశమే ఇక్కడ తలెత్తదు’ అని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్.. తన అధికార నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా అరికెపూడి గాందీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివాదంతోపాటు పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాంలో పీఏసీ ఎంపిక తీరును తప్పుపట్టారు.
‘కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018 నుంచి 2023 వరకు అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ ఎలా ఉన్నారు. అప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే... అది స్పీకర్ విచక్షణాధికారమని బీఆర్‌ఎస్ నేతలన్నారు.
2014లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఏసీ సభ్యులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్‌రెడ్డి పేర్లు ఇస్తే... రేవంత్‌రెడ్డి పేరుకు ప్రత్యామ్నాయం సూచించాలని స్పీకర్ ఎందుకు అన్నారు? ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు నన్ను ఫ్లోర్ లీడర్‌గా గుర్తించాలని చెబితే ఎందుకు గుర్తించలేదు? 2014, 2018లో ఈ విధానాన్ని ప్రారంభించింది మీరే కదా’ అని అన్నారు.
పీఏసీలో 13 మంది సభ్యులుంటే బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురికి, సీపీఐ, ఎంఐఎం, బీజేపీ నుంచి ఒక్కక్కరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టే స్పీకర్ నామినేషన్‌లను పరిశీలించి గాందీకి అవకాశం కల్పించారని తెలిపారు.
కౌశిక్ వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ కోరాలి
కౌశిక్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి, ‘బతకడానికి వచ్చినోళ్లు అంటూ గాం«దీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి వాళ్ల బాస్ చెప్పిందే మాట్లాడారు. కౌశిక్ అలా మాట్లాడొచ్చా లేదా అనేది కేసీఆరే చెప్పాలి. కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలి’ అని అన్నారు. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లు వద్దా? అని నిలదీసిన ముఖ్యమంత్రి.. వాళ్లు ఓట్లేస్తేనే కదా గ్రేటర్‌లో గెలిచిందని గుర్తుచేశారు. ‘బీఆర్‌ఎస్ పెద్దలు మాట్లాడమంటే కౌశిక్ మాట్లాడాడా, లేక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా అనేది స్పష్టం చేయాలి. వీళ్లు మాట్లాడమంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కౌశిక్ వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌ది సైకలాజికల్ గేమ్
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పును ప్రస్తావించగా, ‘తీర్పును నేను అధ్యయనం చేయలేదు. అది చూస్తేనే దీనిపై మాట్లాడగలను’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారనగా.. ‘బీఆర్‌ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. మా పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ 66 మంది ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులేం ఉండవు. ప్రభుత్వాన్ని పడగొడతామన్నందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయి.
ఈ చర్చలన్నీ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నందుకే చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉన్నట్లే కదా. ఏ ఎమ్మెల్యే అయినా అటూఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే ఇక ప్రభుత్వానికి ఢోకా ఎక్కడుంది’ అని అన్నారు. ఇదే అంశంపై మరింత స్పష్టతనిస్తూ ‘కోర్టుకెళ్లి అనర్హతలపై ఆర్డర్ తెచ్చామంటున్నారు.
బీఆర్‌ఎస్ నేతలు ఏ ఆర్డర్ తెచ్చినా.. ప్రభుత్వంలోని పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశమే లేదని చట్ట ప్రకారం నిర్ణయం వస్తే, ప్రతిపక్ష పార్టీలకన్నా, మా పార్టీ వాళ్లమే ఎక్కువ సంతోషిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడివారక్కడే ఉండాలని బీఆర్‌ఎస్ వాళ్లంటున్నారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఎక్కడివారు అక్కడే ఉంటే నా 66 మంది నాతో ఉంటారు.
కేసీఆర్ లక్కీ నంబర్ నా వద్దే ఉంది కదా’ అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామని తిరిగేకంటే పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రివర్గం విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాతే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం పాత్ర వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా 14 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులిచ్చారని, వీటిని ఫిల్టర్ చేసేలా జర్నలిస్టు సంఘాలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment