శాసనసభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
మరోసారి స్పష్టంగా చెబుతున్నా... కల్తీ మద్యం తయారీదారులను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో వ్యవస్థను తీసుకొచ్చాం. అక్రమ, కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఎస్‌ఈబీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కానీ.. లేని విషయాన్ని ఉన్నట్టుగా, సహజ మరణాలనూ అక్రమ మద్యం వల్ల చనిపోయినట్లుగా భ్రమలు కల్పిస్తూ యాగీ చేయడం తప్పని టీడీపీ సభ్యులకు ఈ సభ ద్వారా చెబుతున్నా. ఇప్పటివరకు అక్రమ మద్యంపై ఎస్‌ఈబీ 13 వేల కేసులను నమోదు చేసింది. అక్రమ మద్యం ఎక్కడా ఉండకూడదనే తపనతో కఠినంగా వ్యవహరిస్తున్నాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ కల్తీ మద్యం వల్ల చనిపోయారనే భ్రమలు కల్పించేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా యాగీ చేస్తోందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్య సమస్యలతోపాటు సహజ మరణాల పాలైన వారిని కల్తీ మద్యం మృతులుగా పేర్కొంటూ టీడీపీ సభ్యులు సోమవారం శాసనసభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి జగన్ స్పందించి విపక్షం ఆరోపణలను తిప్పికొట్టారు. కల్తీ మద్యం, అక్రమ మద్యం దందాకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే...
ఏమిటీ ‘అసహజ’ ధోరణి?
2011 లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994. దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు 12 శాతం అని పరిగణిస్తే ప్రస్తుతం అక్కడ 54,880 మంది ఉండవచ్చు. మొత్తం మున్సిపాలిటీలో వారు చెబుతున్న మరణాలే 18. ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఆ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సహజ మరణాలు నెలకు 2 శాతం వరకు ఉంటాయని అంచనా వేసుకున్నా... నెలకు కనీసం 90 మంది సహజంగానే అంటే అనారోగ్యం, వయోభారం, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాంటిది ఈ మాదిరిగా సహజ మరణాలను కూడా వక్రీకరించి మాట్లాడటం మనం ఇక్కడే చూస్తున్నాం.
చంద్రబాబు హయాంలోనూ..
కల్తీ మద్యం తయారీదారులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది...? గతంలో చంద్రబాబు హయాంలో అక్రమ మద్యం తయారీ జరిగింది. అది ఇప్పుడే కొత్తగా జరుగుతున్నదీ కాదు. అప్పుడూ జరిగింది... ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. నేను కాదనడం లేదు. కాబట్టే... స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అనే ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా కల్తీ మద్యం తయారీ లాంటివి గుర్తిస్తే ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మాకు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పాం.
తాగుడు తగ్గించడమే లక్ష్యం
మా ఉద్దేశం, తపన అంతా.. మద్యం వినియోగాన్ని తగ్గించాలన్నదే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన 43 వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేశాం. చంద్రబాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉండేవి. అంతేకాకుండా ఆ మద్యం షాపులకు అనుబంధంగా పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు. 50 మంది నుంచి 60 మంది వరకు అక్కడే కూర్చొని మద్యం తాగేవారు. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి రాగానే పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేశాం. గతంలో బడి పక్కన, గుడి పక్కన ఇలా గ్రామంలో ఎక్కడపడితే అక్కడే మద్యం దొరికేది. రాత్రి 12 గంటలు.. ఒంటి గంట వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టం వచ్చినట్లు తాగించేవారు. లాభాపేక్షే ధ్యేయంగా ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా అమ్మేవారు.
అందువల్లే ప్రభుత్వం చేపట్టింది..
మద్యం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను నివారించడం దాదాపుగా అసాధ్యం. గతంలో ఎటు చూసినా బెల్టు షాపులే. పల్లెల్లో అనధికారికంగా ఏర్పాటు చేసి విక్రయాలు సాగించేవారు. ధనార్జనే ధ్యేయంగా నడిచే ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలుంటే మద్యం వినియోగాన్ని తగ్గించలేమనే ఉద్దేశంతో ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసింది. మద్యం షాపులను కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫలానా సమయానికి మూసివేయాలంటే కచ్చితంగా అదే సమయానికి మద్యం షాపులు మూసి వేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితిని తీసుకొచ్చాం. దీనివల్ల ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా అడ్డుకోగలిగాం. వాటివల్ల తలెత్తే దుష్పరిణామాలను అడ్డుకోగలిగాం.
కల్తీకి ఆస్కారం లేకుండా..
వీటితోపాటు షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం తగ్గింది. కానీ ఈ రకంగా రేట్లు అధికంగా నిర్ణయించడంతో అక్రమ మద్యానికి ఆస్కారం లభిస్తోందని కొంతమంది చెప్పారు. ధరలను తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అరికట్టగలుగుతామని ఎస్‌ఈబీ నివేదిక నివేదిక ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అదే అభిప్రాయం చెప్పాయి. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకుని మళ్లీ ధరలు తగ్గించాం. ఇక అప్పటి నుంచి మన ధరలు ఎక్కువని, విపరీతంగా పెంచామని ఎవరూ చెప్పడానికి అవకాశం లేదు. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది?
Comments
Please login to add a commentAdd a comment