ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం
తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ
వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర
ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి
రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ
రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ
సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు
58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు
2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు
ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం
మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి
99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత
175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది.
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
మోసాలను ఎండగడుతూ..
బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకూ సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమవుతారు. యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంటికీ మేలు చేసిన అంశాన్ని సీఎం జగన్ యాత్రలో వివరించనున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేయనున్నారు.
వ్యవసాయ, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, ఆడపిల్ల పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు పూర్తిగా మాఫీ.. లాంటి 650కిపైగా వాగ్దానాలు గుప్పించి పది శాతం కూడా అమలు చేయకుండా వంచించిన వైనాన్ని సీఎం జగన్ ఎండగట్టనున్నారు. నాడు మోసం చేసిన కూటమితోనే జట్టు కట్టి చంద్రబాబు మళ్లీ వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయా జోష్
చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు.
భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్‌సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది.
కూటమి అష్టకష్టాలు..
వైఎస్సార్‌సీపీని ప్రజాక్షేత్రంలో ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని బెంబేలెత్తిన చంద్రబాబు ఉనికి కోసం జనసేన అధ్యక్షుడుతో జట్టు కట్టారు. టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో 2 పార్టీలూ నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో జత కలిశారు.
మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు జనం కదలిరాలేదు. ఆ సభా పేలవంగా సాగడంతో మూడు పార్టీలదీ అవకాశవాద పొత్తులని ప్రజలు తేల్చి చెప్పినట్లయింది. పొత్తు కుదిరినా ఇప్పటికీ మూడు పార్టీలు తమ అభ్యర్థులను పూరిగా ప్రకటించలేని స్థితి నెలకొంది.
మరింత పెరిగిన విశ్వసనీయత..
ఎన్నికల్లో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. గత 58 నెలల్లో నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావులేకుండా 87 శాతం కుటుంబాల ప్రజలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ)తో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీతో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు.
రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. విప్లవాత్మక సంస్కరణల ద్వారా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. హామీలన్నీ అమలు చేయడం, సుపరిపాలన అందిస్తుండటంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది.
తొలి రోజు యాత్ర ఇలా..
► సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.
► మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.
► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment