(ఫైల్ ఫోటో)
ఆయనంటేనే అదో టైపు.. అందులో సీనియర్... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత.. మీడియా ముందే బాహాటంగానే కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని పార్టీలో నెలగడం కష్టమని ఆరోపించారు.. కానీ ఇప్పుడు ఆ నేత ఇంట్లో నుంచే ఒకే నియోజకవర్గానికి... రెండు దరఖాస్తులు చేసుకున్నారు.. దీంతో టికెట్ తండ్రికి వస్తుందా, కూతురును వరిస్తుందా అంటూ పార్టీ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకు ఒకింట్లో రెండు టికెట్ల పంచాయతీ ఏంటి?
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోల్ నుండి ఐదు సార్లు పోటీ చేయగా మూడు సార్లు విజయం సాధించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో వ్యవసాయ, మార్కెట్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహను హైకమాండ్ నియమించింది.
ప్రజలు ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన.. తెలంగాణ రాష్టం ఏర్పడినప్పటి నుంచి ఆయనకు రాజకీయాలు కలిసిరావడం లేదు. ఈ సారి ఎలాగైనా గెలవలన్నా పంతంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ దామోదర రాజనర్సింహ కూతురు త్రిష.. నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో భరోసానిస్తూ నూతన ఉత్సహన్ని కల్గిస్తుంది. అయితే ఇటీవల గాంధీభవన్‌లో అందోల్ సీటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కూతురు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అందోల్ కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
గత కొంతకాలం నుంచి త్రిష అందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజలకు దగ్గరవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేకపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత అయోమయానికి లోనవుతున్నారు.
రాజనర్సింహకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ సీడబ్ల్యుసీ శాశ్వత పదవి కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపిన.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం, నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముక్కునవేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ టికెట్లు ప్రకటించక ముందు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో దామోదర రాజనర్సింహ అక్కడి నుండి పోటీ చేస్తారన్న వినికిడి కూడా జోరుగా వినిపించింది.
ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా, కూతురు త్రిష బరిలో ఉంటారా అన్న సందిగ్ధం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రస్తుతం నెలకొంది.
చదవండి: ‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment