సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో కొనసాగే అంశంపై రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆమె విడుదల చేసిన ఓ ప్రకటన ఇందుకు ఊతమిచ్చేలా కనిపిస్తోంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అంటూనే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఆమె పేర్కొనడం గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, భయపెట్టి ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది’’అని విజయశాంతి పేర్కొన్నారు.
అదే ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అంశాన్ని కూడా విజయశాంతి ప్రస్తావించారు. ‘‘మరికొంత ముందుగానే మాణిక్యం ఠాగూర్ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి’’అని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా పార్టీ వ్యవహారాల్లో స్తబ్దుగా ఉంటున్న విజయశాంతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల కలిశాక ఆమె వ్యవహరిస్తున్న తీరులో మార్పు కనిపిస్తోందని, ఆమె బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
‘లేడీ అమితాబ్’మనసులో ఏముందో..
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయశాంతిని కలిసి బీజేపీలో చేరాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినప్పటికీ ఆమె బీజేపీలోకి వెళ్లపోతారనే ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. కాంగ్రెస్‌లో ఇలా పార్టీ ఇన్‌చార్జీలు వెళ్లి కలవడం చాలా అరుదు. అయితే విజయశాంతి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందనే ఆలోచనతో మాణిక్యం ఈ చర్యకు ఉపక్రమించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆమె చెప్పిన విషయాలను బట్టి విజయశాంతి కాంగ్రెస్‌లో ఉంటారనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమైంది.
కానీ వాయిదాల పద్ధతిలో విజయశాంతి విడుదల చేస్తున్న ప్రకటనలు మరో అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక రోజున ఆత్మ ప్రభోదానుసారం ఓటేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విజయశాంతి... టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ హోదాలో ఉండి కూడా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరలేదు. పైగా ఆ పోస్టింగ్‌లో తన పేరు కింద హోదాను ప్రస్తావించేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment