Congress MLA Jagga Reddy Fires On Revanth Reddy Over VH Meets Yashwant Sinha - Sakshi
Sakshi News home page

ఇది నీ జాగీర్‌ కాదు.. మేం నీ నౌకర్లం కాదు 

Published Sat, Jul 2 2022 6:11 PM | Last Updated on Sun, Jul 3 2022 2:01 AM

Congress MLA Jagga Reddy Fires On Revanth Reddy VH Meets Yashwant Sinha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపింది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు బేగం పేట ఎయిర్‌పోర్టులో సిన్హాను కలవడం వివాదాస్పదమైంది. వీహెచ్‌ వ్యవహారం తన దృష్టికి రాలేదని, పార్టీ నిబంధనలు దాటితే ఎంతటి వారినైనా గోడకేసి కొడతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘అసలు రేవంత్‌ ఎవడు? ఎవరిని కొడతావో కొట్టు చూద్దాం’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీని కొనుక్కున్నావా?.. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నీ నౌకర్లమేమీ కాదు..’అని మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..  

సంబంధిత వార్త: కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్‌ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్‌

మళ్లీ మాట్లాడాల్సి వస్తోంది 
‘టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి రేవంత్‌ అలా ఎలా మీడియా ముందు టెంప్ట్‌ అయ్యారు. నేను గతంలో టెంప్ట్‌ అ యితే అనేక పంచాయితీలు వచ్చాయి. రాహుల్‌ గాంధీతో సమావేశం తర్వాత నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రేవంత్‌ మళ్లీ మా ట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. సీనియర్‌ నాయకులను కొడతా అని వ్యాఖ్యానిం చిన వ్యక్తి పీసీసీ పదవిలో కొనసాగకూడదు. దిగిపోవాలి. దీనిపై సోనియాగాంధీ, రాహుల్‌ గాం ధీలకు లేఖ రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతా..’అని జగ్గారెడ్డి తెలిపారు. 

సీఎల్పీని డమ్మీ చేశాడు...  
‘పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్లు. కానీ సీఎల్పీ పోస్టును రేవంత్‌ రెడ్డి డమ్మీ చేశాడు. ఏమాత్రం విలువ ఇవ్వ కుండా ప్రవర్తిస్తున్నాడు. భట్టి విక్రమార్క ను ఆగం చేస్తున్నాడు. రేవంత్‌ చేస్తున్న తప్పులన్నీ పార్టీకి లేఖ ద్వారా వివరిస్తా..’అని తెలిపారు.

మాపై కోవర్టులని ముద్రవేశాడు..  
‘గతంలో కోవర్టులని నా మీద, వీహెచ్‌ మీద ముద్రవేసి హైకమాండ్‌కు రేవంత్‌రెడ్డి అనేకసార్లు లేఖలు రాయించాడు. మాపై విషప్రచారం చేశాడు. అసమ్మతి వర్గానికి, కోవర్టులకు తేడా తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి..’అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. 

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
‘రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడేవాడు ఎవడూ లేడు. ఇది రేవంత్‌ జాగీర్‌ కాదు. మీడియా ముందు ఎలా నోరు పారేసుకుంటావు. నాకు వార్నింగ్‌ ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ఎవడు? రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు, ఆహ్వానంపై ఇప్పటివరకు టీపీసీసీ సమావేశం కానీ సీఎల్పీ సమావేశం కానీ ఏర్పాటు చేయలేదు. యశ్వంత్‌ సిన్హాను కలవాలని గానీ, కలవకూడదని గానీ ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీలో యశ్వంత్‌సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ, కేటీఆర్‌ పాల్గొంటే లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? రేవంత్‌ తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు.  
చదవండి: డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నా: తెలుగులో మోదీ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement