మీట్ అండ్ గ్రీట్‌లో మాట్లాడుతున్న రేవంత్. పక్కన సీతక్క
సాక్షి, హైదరాబాద్: ‘దళితుడైన మల్లికార్జున ఖర్గేకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అవకాశమిచ్చాం. పేదలు, దళితులు, ఆదివాసీల పక్షానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరూ ఆలోచన చేయనప్పుడే ఆ వర్గాల నుంచి వచ్చిన నేతను రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, భవిష్యత్తులో కూడా వారికి విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయని వెల్లడించారు.
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ సోమవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించడంతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఓ ఎన్‌ఆర్‌ఐ ఆసక్తికర ప్రశ్న వేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు.
ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన రేవంత్.. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎంలు ఓబీసీలేనని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు.
అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పదని స్పష్టం చేశారు. సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్‌ఆర్‌ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మనం కలసికట్టుగా అభివృద్ధి చెందాలి
మీట్ అండ్ గ్రీట్‌లో భాగంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వేర్వేరనే భావనను రానీయవద్దని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు. అభివృద్ధిలో మనం అమెరికాతో పోటీ పడాలి. ఏపీ, తెలంగాణ కలసికట్టుగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటేనే ప్రపంచంతో పోటీ పడతాం’అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు తానా మహాసభల్లోనూ రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రవాస తెలంగాణీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment