కేసీ వేణుగోపాల్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు
అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
కాంగ్రెస్ లోక్‌సభ ఇన్‌చార్జులు, అభ్యర్థులకు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
తెలంగాణలో పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని, దక్షిణాదిన ఇండియా కూటమిదే ఆధిక్యమని అంతర్గత సర్వేలు చెబుతున్నాయి..
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం
ఆ పార్టీల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పక్కాగా ప్రచార షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచన
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులతో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని.. ఉత్తర భారతంలో బీజేపీ బలహీనపడుతుందని అంతర్గత సర్వేలు చెప్తున్నాయని వివరించారు. తెలంగాణలో కనీసం 14 స్థానాల్లో గెలుస్తామని వెల్లడైందన్నారు. ఈ సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని.. ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒకరోజు పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన కేసీ వేణుగోపాల్.. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో టీపీసీసీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, కీలక నేతలు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలోనే ఉండండి..
‘‘ఈ నెల 18లోపు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో.. అసెంబ్లీ, మండలం, గ్రామం ప్రాతిపదికన ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేపట్టాలో పక్కా షెడ్యూల్ రూపొందించుకోవాలి. దాన్ని ఏఐసీసీకి పంపాలి. అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలి. వీలైనన్ని ఎక్కువ గ్రామాలు తిరగాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల సదస్సులు పెట్టండి. మాదిగ సామాజికవర్గ ఓట్లను పొందేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లండి. ఏఐసీసీ నేతలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి తెలంగాణలో పర్యటిస్తారు.
అందుకు తగినట్టుగా ప్రచార షెడ్యూల్, ఏర్పాట్లు చేసుకోండి..’’ అని కేసీ వేణుగోపాల్ సూచించారు. బీఆర్‌ఎస్ మునిగిపోయిన నావ అని, బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల వ్యతిరేకత ఉందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. ఆ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, బీఆర్‌ఎస్ దుర్మార్గాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
లోక్‌సభ స్థానాల వారీగా సర్వే వివరాలతో..
రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల వారీ పరిస్థితులపై నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించారు. లోక్‌సభ స్థానాల వారీగా సర్వేల్లో వెల్లడైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చాలా అవసరమని.. ఆ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు నాయకులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం సెగ్మెంట్లలో ఎవరిని ఖరారు చేయాలన్న దానిపై నేతల నుంచి కేసీ వేణుగోపాల్ మరోమారు అభిప్రాయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరనున్నారని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో ఘర్ వాపసీని ముమ్మరం చేయాలని.. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లలోకి వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తామంటే చేర్చుకోవాలని సూచించారని తెలిసింది.
కాగా.. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ స్థానాల ఇన్‌చార్జులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, సుదర్శన్‌రెడ్డి, సంపత్‌కుమార్, మైనంపల్లి హన్మంతరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్‌లతోపాటు పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
మీ ప్రణాళికలేంటో చెప్పండి
కేసీ వేణుగోపాల్‌తో భేటీకి ముందు ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో ప్రచారం తీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ సమన్వయం, నేతల సహకారం, ఇన్‌చార్జులతో కలసి రూపొందించుకున్న ప్రణాళికలపై అభ్యర్థులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల సర్వే రిపోర్టులను వారికి వివరించి.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment