ఇక ఢిల్లీలో ‘కల్లాల’ గళం  | Congress Will Take Telangana Paddy Farmers Battle To Delhi: Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఇక ఢిల్లీలో ‘కల్లాల’ గళం 

Published Mon, Nov 29 2021 2:51 AM | Last Updated on Mon, Nov 29 2021 2:51 AM

Congress Will Take Telangana Paddy Farmers Battle To Delhi: Revanth Reddy - Sakshi

రేవంత్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేస్తున్న జానారెడ్డి. చిత్రంలో శ్రీధర్‌బాబు,  కోమటిరెడ్డి, పొన్నాల, సీతక్క, వి.హనుమంతరావు, సుదర్శన్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తానని ఢిల్లీ వెళ్లి.. ఉత్తి చేతులతో తిరిగి వచ్చేసిన సీఎం కేసీఆర్‌లాగా తాము మోసం చేయలేమని, తెలంగాణ రైతాంగం పక్షాన ఢిల్లీలో గళం వినిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో డిసెంబర్‌ 9 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు.

టీపీసీసీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల ‘వరి దీక్ష’ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో పాల్గొన్న రేవంత్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్, బీజేపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. వరి పండించవద్దని చెప్పి నా తన మాట వినకుండా గత యాసంగిలో వరి పంట వేసిన రైతులపై కక్ష తీర్చుకోవడంలో భాగంగానే కేసీఆర్‌ ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు పెడుతు న్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కలసి దేశంలోని రైతాంగం పండించే పంటలను అదానీ, అంబానీలనే కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, మోదీ, కేసీఆర్, అదానీ, అంబానీలది దుష్టచతుష్టయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. సీఎం కేసీఆర్‌తో కలసి దొడ్డిదారిలో ఆ చట్టాల్ని ప్రజలపై రుద్దుతోందని విమర్శించారు. వచ్చే సీజన్‌ నుంచి ధాన్యం కొనేది లేదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ మెడలు వంచి ధాన్యం సమస్యను పరిష్కరిస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ కనీసం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కూడా అడగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్లాలపై రైతులు చనిపోయిన ఘటనలకు కేసీఆరే బాధ్యుడని అన్నారు. కాగా, రైతులు కష్టాల్లో ఉంటే బీజేపీ నేతలు పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని రేవంత్‌ విమర్శించారు. రైతుల శవాల మీద గద్దెనెక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దు య్యబట్టారు. తెలంగాణలో రైతులతో పెట్టు కున్నోడు రాజ్యమేలిన దాఖలాలు లేవని, గతంలో చంద్రబాబు కూడా రైతులతో పెట్టుకునే తుడిచిపెట్టుకుపోయారని అన్నారు.

ఈ దీక్షతో కనువిప్పు కలగాలి: జానా 
సీనియర్‌ నేత జానారెడ్డి మాట్లాడుతూ వరి దీక్షతో ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని అన్నారు. తమ పార్టీ దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవత్వం లేని కేసీఆర్‌ పని ఖతం అయిందని అన్నారు. వరి వేస్తే ఉరి.. రైతులకు కాదని, కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని ఉరి వేసేందుకు రైతులు సిద్ధం గా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మనస్ఫర్థలు సాధారణమేనని, అందరం కలసి పని చేస్తామని చెప్పిన కోమటిరెడ్డి తన రక్తంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు.

ఢిల్లీలో ధర్నాకు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆ హ్వానించి తెలంగాణ రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, జి.చి న్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సుదర్శన్‌రెడ్డి, సునీతారావు, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావులతో పాటు పలువురు ఇతర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

దీక్షలో భాగంగా మొత్తం 9 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారం గురించి నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన 92 ఏళ్ల రైతు రాంరెడ్డి పాడిన పాటను అభినందించిన రేవంత్‌ ఆయనకు పాదాభివందనం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement