తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయాన్ని పలు రాష్ట్రాల్లో కొలిక్కి తీసుకుస్తోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో మొదటి జాబితాలోనే సుమారు వంది మంది అభ్యర్థులను ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ).. కేరళలో తమ పార్టీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఐ ప్రకంటిచిన జాబితాలో వయ్‌నాడ్ సెగ్మెంట్‌లో పోటీ చేయనున్న అభ్యర్థి కూడా ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వయ్‌నాడ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వయ్‌నాడ్ స్థానంలో సీపీఐ.. ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సతీమణి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకురాలు అన్నే రాజా.. రాహుల్‌గాంధీపై పోటీపడబోతున్నారు.
తిరువనంతపురం, మావెలిక్కర, త్రిస్సూర్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది సీపీఐ. తిరువనంతపురం నుంచి పన్నియన్ రవీంద్రన్, మావెలిక్కర నుంచి అరుణ్ కుమార్, త్రిస్సూర్ నుంచి వీఎస్ సునీల్ కుమార్ సీపీఐ అభ్యర్థులుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో రాహుల్ గాంధీ వయ్‌నాడ్ లోససభ నియోజకర్గం నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో సీపీఐ పార్టీ భాగస్వామ్యం పార్టీగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment