జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!? | Eenadu Malicious Story On Jagananna Gorumudda MLA Parthasarathy Fire | Sakshi
Sakshi News home page

జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!?

Published Tue, Jan 2 2024 3:43 PM | Last Updated on Mon, Jan 29 2024 2:36 PM

Eenadu Malicious Story On Jagananna Gorumudda MLA Parthasarathy Fire - Sakshi

గుంటూరు, సాక్షి:  పేదలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కానీ, యెల్లో మీడియా మాత్రం విషపు రాతలతో ద్వేషం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మండిపడ్డారు. తాజాగా జగనన్న గోరుముద్దపై ఈనాడు ప్రచురించిన కథనాన్ని  ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. 

‘‘జగనన్న గోరుముద్ద మీద విషం చిమ్మడం ఘోరమైన విషయం.  గోరుముద్దకు బడ్జెట్ పెంచడంతో పాటు మంచి మెనూను రూపొందించాం. ప్రతీ రోజూ వెరైటీ మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. ఈ మెనూని రూపొందించింది స్వయంగా సీఎం జగనే. ఈ పథకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను స్వయంగా అనేక గ్రామాల్లో నేరుగా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నా.. 

.. గతంలో వంట ఖర్చులకు రూ. 3.50 పైసలిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.6.50 రూపాయలిస్తోంది. దేశంలో ఎక్కడా ఏ పాఠశాలలోనూ లేనట్లుగా గోరుముద్ద ద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం. గతంలో 32 లక్షల మందికి మాత్రమే భోజనం పెట్టేవారు. మా ప్రభుత్వంలో 43 లక్షలకు పైచిలుకు విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్ధులకు మంచి భోజనం అందించేందుకు సంవత్సరానికి రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయినా అసత్యపు రాతలతో విద్వేషం ప్రదర్శించడం సరికాదని అన్నారాయన.

ఇంకా పెనమలూరు  ఎమ్మెల్యే పార్థసారథి ఏమన్నారంటే.. 

ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులు తినే తిండిపైనా రామోజీ విషం చిమ్ముతున్నాడు. మీడియాను అడ్డంపెట్టుకుని వారి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఖర్చు చేసిన దానికంటే, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, 50-60 శాతం నిధులు పెంచి, 16 రకాల మెనూతో 43 లక్షలకు విద్యార్థులకు(గతంలో కంటే11లక్షల మంది విద్యార్థులకు అదనంగా) శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంటే, పనిగట్టుకుని రామోజీ కట్టకథలు రాయడంపై పార్థసారథి తూర్పారబట్టారు. 

ఎల్లోమీడియా పైత్యపు రాతలు

  • ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. రోజుకో మెనూతో, శుచి, శుభ్రమైన పౌష్టిక ఆహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మంచి కార్యక్రమం ఇది.  
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద కార్యక్రమాన్ని  పటిష్టంగా అమలు చేస్తోంది.
  • గత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంగా నూకలతో వండిన అన్నం పెట్టేవారు. ఉడికీ ఉడకని అన్నంతో, సాంబారు పేరుతో పల్చటి నీళ్లచారుతో మమ అనిపించేవారు
  • అలాంటిది, మా ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన, విట్‌మిన్‌లతో కూడిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ను వాడుతున్నామని అందరూ గమనించాలి.  
  • పిల్లలకు పాఠశాలల్లో బలవర్థకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ప్రభుత్వంపై పనిగట్టుకుని కల్పిత కథనాల్ని రాస్తుంది. 
  • దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై ఎల్లోమీడియా పైత్యం చూపించే రాతలు రాయడం ఎంతమాత్రం తగదు. 

16రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డు

  • జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతీ రోజూ రాగిజావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నాం. 
  • ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు, ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందిస్తున్నాము. మిగిలిన మూడురోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందజేయడం జరుగుతోంది. 
  • ప్రతీరోజూ స్వీట్, ఆకుకూర పప్పు, సాంబార్‌లాంటి రుచికరమైన పదార్థాలతో పాటు వారానికి ఐదురోజుల పాటు ఉడికించిన కోడిగుడ్డు కూడా విద్యార్థులకు అందిస్తున్నాం

టీడీపీ హయాంలో కంటే 50శాతం పెంపు ఖర్చుతో..

  • కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదు. 
  • గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం విద్యార్థికి రూ.3.50పైసలు ఇస్తే.. మా ప్రభుత్వం మాత్రం దాన్ని రూ.6.50పైసలకు పెంచింది.
  • అదేవిధంగా వంటసిబ్బందికి అందజేసే గౌరవ వేతనం విషయంలో గత ప్రభుత్వం కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చింది. అదే మా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3వేలు చేసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 
  • అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతీ విద్యార్థికి భోజన ఖర్చు రూ.11.26పైసల నుంచి 50 శాతం పెంచి రూ.16.07పైసలు ఖర్చు చేస్తున్నారు. 
  • అదే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు గత ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం కంటే 50 నుంచి 60 శాతం పెంచి, ప్రతి విద్యార్థికి రూ. 18.75, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ. 23.40 చొప్పున ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందజేస్తున్నాం. 

వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు

  • గత ప్రభుత్వహయాంలో వంట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల నుంచి ఏడాది దాటినా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే పరిస్థితిలేదు. 
  • అదే జగన్‌ గారు ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడురెట్లు అధికంగా వంటసిబ్బందికి గౌరవ వేతనాలు పెంచడంతో పాటు వంట ఏజెన్సీలకు క్రమం తప్పకుండా సకాలంలో బిల్లుల్ని చెల్లిస్తున్నాం 

11 లక్షల విద్యార్థులకు అదనంగా..

  • గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43 లక్షల 46వేల 299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తున్నాం. అంటే, గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 
  • గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి చేసిన సగటు వ్యయం రూ.450 కోట్లు అయితే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రూ.7,244 కోట్లకు పైగా ఉన్నాయి.2023-24 బడ్జెట్ లోనూ రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. అంటే పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు.  

ఎల్లోమీడియా రాతల్ని అంతా ఖండించాలి

  • జగనన్న గోరుముద్ద లాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వాన్ని అభినందించకపోగా.. ప్రభుత్వంపైనే ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరూ ఇలాంటి రాతల్ని హర్షించరు. 
  • అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనలాంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంలో జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటోంది. 
  • జగన్‌గారు రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా ఇప్పటికే డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లల్లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిన సంగతి అందరికీ తెలిసిందే. 
  • కనుక, మంచి పరిపాలన అందజేస్తోన్న ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా ఎల్లోమీడియా రాతలు రాయడాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement