అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీకి అందించారు.
ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ ఈ రోజు సందర్శించారు. సుమారు 1000 ఏళ్ల నాటి మసీదు గోడలపై చెక్కిన శాసనాలను ప్రధాని తిలకించారు. 13,560 మీటర్లలో విస్తరించిన మసీదును భారత్‌లోని దావూదీ బోహ్రా కమ్యునిటీలు 1970లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి వారే దాని పర్యవేక్షణ బాధ్యతలను చేపడుతున్నారు. గుజరాత్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న బోహ్రా తెగలతో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈజిప్టులోని భారత రాయబారి అజిత్ గుప్తే ఈ సందర్భంగా తెలిపారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాలో పోరాట సమయంలో మరణించిన 4000 మంది భారత సైనికులకు గుర్తుగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షునితో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment