సీఎం ఏక్‌నాథ్ శిందేకు పోటీగా కేదార్ దిఘే శిందే
శిందేపై గురి ఎక్కుపెట్టిన శివసేన (యూబీటీ)
థాణేలోని కోప్రి –పాచ్‌పాఖడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) కేదార్ దిఘేను బరిలోకి దింపింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఏక్‌నాథ్ శిందేకు, కేదార్ దిఘేల మధ్య రసవత్తర పోటీ జరగనుంది. వాస్తవానికి కేదార్ దిఘే శిందే గురువు దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే సోదరుని కుమారుడు. దీంతో ఇక్కడ వీరిద్దరి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికపై థాణేతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే అనేకమంది అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటించగా మిగిలిన అభ్యర్థులను కూడా ఒక్కోరిని ప్రకటిస్తూ వస్తున్నారు. నామినేషన్లు దాఖలు గడువు ఈనెల 29తో ముగియనుండగా నవంబర్ 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నికల అసలు చిత్రం నవంబర్ 4న స్పష్టం కానుంది.
శివసేన కంచుకోటగా థాణే
ముఖ్యంగా థాణేలో గత 30 ఏళ్లుగా శివసేనకు కంచుకోటగా మారింది. అయితే రెండున్నరేళ్ల కిందట ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అయితే థాణేలో మంచి పట్టున్న ఏక్‌నాథ్ శిందేకు అక్కడి కార్పొరేటర్లలో అత్యధికమంది మద్దతు పలికారు. అయితే ఉద్దవ్ ఠాక్రేకు మాత్రం వేళ్లమీదలెక్కించేంతమంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతు పలికారు. దీంతో వీరిద్దరిలో ఎవరి ప్రభావం ఉండనుంది..? ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ఏక్‌నాథ్ శిందేకు థాణేపై పట్టు!
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు కోప్రీ – పాచ్‌పాఖడీ అసెంబ్లీయే కాకుండా థాణేలో మంచి పట్టు ఉంది. దీంతో 2004లో ఏక్‌నాథ్ శిందే మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కోప్రీ – పాచ్‌పాఖడీ అసెంబ్లీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ శిందేపై 32,677 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరిగింది. ముఖ్యంగా 1,00,316 ఓట్లు పోలయ్యాయి. అదే ప్రత్యర్థి సందీప్ లేలేకు 48,447 ఓట్లు పోలయ్యాయి. ఇలా ఏక్‌నాథ్ శిందే 51,869 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
చదవండి: తెలుగువారిపై మహరాష్ట్ర రాజకీయ పార్టీల చిన్నచూపు ఎందుకు?
ఇక గత ఎన్నికల్లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ ఘాడిగావ్కర్‌పై 90 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇలా ప్రతీసారి ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తోంది. అయితే శివసేనలో తిరుగుబాటు చేసిన అనంతరం శివసేన పార్టీతోపాటు పార్టీ చిహ్నం ఏక్‌నాథ్ శిందేకే దక్కింది. దీంతో ఈసారి మొట్టమొదటిసారిగా శివసేన (శిందే) వర్సెస్ శివసేన (యూబీటీ)ల మధ్య పోటీ జరుగుతోంది.
దిఘే ప్రభావం చూపేనా...?
రెండున్నరేళ్ల కిందట శివసేనలో తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపారు. అయితే థాణే ఓటర్లు పెద్ద సంఖ్యలో దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు మద్దతు పలికేవారు. దీంతో ఈ ఓటర్లు బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)వైపు మొగ్గు చూపుతారా? శిందేకు పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో మాత్రం శివసేన (శిందే) అభ్యర్థి నరేష్ మస్కేకు 1.11 లక్షల ఓట్లు, శివసేన (యూబీటీ) అభ్యర్థి రాజన్‌విచారేకు 66,260 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏక్‌నాథ్ శిందే ప్రభావమే అధికంగా ఉందని ఈ ఫలితాల ద్వారా కన్పిస్తోంది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘేను ఏక్‌నాథ్ శిందే గురువుగా కొలుస్తారు. దీంతో ఆనంద్ దిఘే సోదరుని కుమారుడైన కేదార్ దిఘేకు థాణే ఓటర్లు అనుకూలంగా మారే అవకాశమూ ఇక్కడ లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment