సాక్షి ప్రతినిధి, బాపట్ల: అడ్డూ అదుపూ లేకుండా అవకాశమున్న మేర అక్రమాలకు తెగబడితే ఏదో రోజు పట్టుబడి ఇట్టే ఇరుక్కు పోవడం ఖాయమన్న విషయం ఇప్పుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అవగతమైంది. తన నోవా అగ్రిటెక్ కంపెనీ మాటున ఎన్‌ఆర్‌ఐ, గ్రానైట్ నల్లధనంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిì ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి, ఆయన అనుచరులపైనా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
సమగ్ర విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీంతో ఏలూరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆయనకు నల్లధనం అందించిన ఆయన అనుచరులు బెంబేలెత్తి పోతున్నారు. కేసుల నమోదుతో ఎమ్మెల్యే వ్యవహారం పర్చూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
డైరీల్లో నిధుల వివరాలు!
ఈ నెల 24న గుంటూరులో ఏలూరికి చెందిన నోవా అగ్రిటెక్ కార్యాలయంలో ఆర్‌డీఐ జరిపిన తనిఖీల్లో ఆయన ఖాతాలకు చేరిన నల్లధనం చిట్టాతోపాటు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఇంకొల్లు పోలీసులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన కంపెనీ ఉద్యోగులపైనా 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్‌విత్ 120(బి), సీఆర్‌పీసీ 155 (2) ల ప్రకారం కేసులు నమోదు చేసి లోతైన విచారణకు దిగారు. ఈ విచారణలో ఎమ్మెల్యే ఏలూరికి పెద్దఎత్తున నిధులు సమకూర్చే ఎన్‌ఆర్‌ఐలు, నియోజకవర్గంలోని గ్రానైట్ వ్యాపారుల అక్రమార్జన బయటపడే అవకాశం ఉంది.
ఏలూరి కార్యాలయంలో దొరికిన డైరీల్లో ఆయనకు తరలివచ్చే నిధుల వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన అకౌంట్లకు వచ్చిన నిధులపైనా, గ్రానైట్ పరిశ్రమల ముడుపులపైనా పోలీసులు విచారణ జరపనున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే, ఆయన కంపెనీ ప్రధాన ఉద్యోగులపై కేసులు నమోదు కావడంతో ఏలూరికి నిధులు సమకూర్చే ఎన్‌ఆర్‌ఐలు, గ్రానైట్ వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. నిధుల వ్యవహారాలు బయటకు పొక్కితే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
నిధులు ఇచ్చే ఎన్‌ఆర్‌ఐల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఐలు అధికంగా ఉన్న గ్రామాలతోపాటు వారు ఉన్న దేశాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని మార్టూరు ప్రాంతంలో 250కి పైగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలపైనా పోలీసులు విచారణకు దిగనున్నారు. గ్రానైట్ అసోసియేషన్ల నుంచి ఏలూరికి ముట్టిన ముడుపుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న గ్రానైట్ వ్యాపారుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తారు. ఏలూరి ఖాతాలకు, ఆయన నోవా అగ్రిటెక్ బ్యాంకు ఖాతాలకు వచ్చిన నిధుల వివరాలపైనా విచారణ జరుపుతారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన నల్లధనం వివరాలను బట్టి ఆయా వ్యక్తులపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
దొంగ ఓట్లతోనే రెండు సార్లు గెలుపు!
ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఏలూరి నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేలకు మించి దొంగ ఓట్లను చేర్పించారు. ఇక్కడి వారికి చాలామందికి ఈ నియోజకవర్గంలోనే రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో వారంతా పోలింగ్ నాడు పథకం ప్రకారం ఓట్లు వేయడం పరిపాటి. దొంగ ఓట్లు వేసేందుకు ఏలూరి ప్రత్యేక బ్యాచ్‌లనూ ఎంపిక చేస్తారు. నల్లధనంతో కోట్లు ఖర్చు చేసి అక్రమాలకు తెరలేపుతారు. ఓటుకు రూ.2 వేల నుంచి 5 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేసిన ఉదాహరణలూ కోకొల్లలు.
విపరీతంగా వచ్చిపడుతున్న అక్రమార్జన నిధులను వెచ్చించి ఎన్నికల అక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ఆయనకు పరిపాటిగా మారింది. దీంతో ఆయన గత రెండు ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సుమారు 10,775 ఓట్ల ఆధిక్యంతో, 2019 ఎన్నికల్లో కేవలం 1647 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏలూరి గెలిచే అవకాశమే లేదన్నది ఓట్ల గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది.
పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు దిగిన అధికారులు నియోజకవర్గంలోని సుమారు 12 వేలదొంగ ఓట్లను తొలగించారు. దొంగ ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు ఏలూరి కోర్టును సైతం ఆశ్రయించినా అది వీలుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment