సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి పార్టీలోనే కొనసాగు తున్న ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హోదాలోనే కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. మంగళ వారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని భట్టి నివాసానికి వెళ్లిన ఈటల దాదాపు 40 నిమి షాల పాటు మంతనాలు జరిపారు.
రాష్ట్రం లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కరోనా తీవ్రత గురించి ఇద్దరు నేతలూ చర్చించినట్టు చెబుతున్నా... అంతర్గతంగా మాత్రం కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఈటలను భట్టి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఈటల, సమయం కోసం ఎదురుచూద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, తాను లేకుండా కేబినెట్ సమావేశం జరిగిన రోజే ఈటల.. భట్టితో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదేనా సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ..
ఇరువురి భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాల గురించే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఆత్మ గౌరవంతో కూడిన సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే నాడు సోనియాను ప్రత్యేక తెలంగాణకోసం ఒప్పించామని, అయితే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో పరిణామాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. నియంతృత్వ పోకడలతో ఆత్మగౌరవానికి తావు లేని తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తున్నారని, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేయాలని భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చల ఆంతర్యం ఏమిటన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అప్పుడే మల్లగుల్లాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment