కోల్‌కత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్‌లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో సందేశ్‌ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్ డ్రామా). సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్ కార్డ్స్, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్ చేశారు. ఇక, సందేశ్‌ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్ కూడా ఒకరు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్‌ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్ షాజాహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్‌ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది. బసిర్‌హత్ లోక్‌సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment