ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు.
‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు.
చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు!
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు.
గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు.
Comments
Please login to add a commentAdd a comment