కూకట్‌పల్లి/సుభాష్ నగర్: మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం తాము 100 రోజులపాటు వేచి చూస్తామని, అప్పటికీ హామీలను నెరవేర్చకపోతే ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతోపాటు మేడ్చల్–మల్కాజిగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో రైతులు, పట్టణాల్లో ప్రజలు సంతోషంగా లేరని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తగినన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఓటమితో కుంగిపోవద్దు..
అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని... అందుకు కార్యకర్తలు నిరాశ చెంద వద్దని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీల వరకు మనవాళ్లే ఉన్నారని... ఏదైనా సమస్యలుంటే వారిని కలవాలని భరోసా ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ, హైదరాబాద్ హక్కులు, రాష్ట్రాభివృద్ధి కోసం మాట్లాడే ధైర్యం ఒక్క గులాబీ పార్టీకే ఉందని... అందుకే కాంగ్రెస్, బీజేపీలను నమ్మకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు.
ఆయా కార్యక్రమాల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూకట్‌పల్లి నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్ సతీష్ అరోరా, నిజాంపేట్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడటానికి సీఎంకు భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ‘తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తన వ్యాఖ్యలతోపాటు జత చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని నిలదీశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీని ఎదిరించేది ప్రాంతీయ పార్టీలేదేశంలో బీజేపీని అడ్డుకొనే శక్తి కేవలం
ప్రాంతీయ రాజకీయ పార్టీలకే ఉందంటూ కేటీఆర్ ‘ఎక్స్’లో మరో పోస్ట్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 300 చోట్ల పోటీచేసినా కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం అనుమానమేనంటూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నా రు. కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లే విపక్ష ఇండి యా కూటమి చెల్లాచెదురవుతోందని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె: కేటీఆర్‌తో వృద్ధురాలు
కేసీఆర్ పాలనే బాగుండేదని.. పింఛన్ సొమ్ము సకాలంలో వచ్చేదంటూ ఓ వృద్ధురాలు కేటీఆర్‌తో పేర్కొంది. శనివారం కుత్బుల్లాపూర్‌లో జరిగిన కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
వారి సంభాషణ సాగింది ఇలా..
వృద్ధురాలు: మాకు కేసీఆర్ ఉన్నపుడే బాగుండె.. టయానికి పింఛన్ ఒస్తుండె. కరెంటు పోకుండా ఉంటుండె. ఇప్పుడు ఊకే కరెంటు పోతాంది. ఈ ప్రభుత్వం తీరు ఏం అర్థమైతలే.. మాకు కేసీఆరే బాగుండే.. మళ్లీ ఆయన వస్తేనే మంచిగుంటది.
కేటీఆర్: మళ్లీ అదే పాలనను తప్పకుండా తెచ్చుకుందాం. ఇప్పు డు ‘విడాకులు’ కావాల్నంటే ఐదేళ్లు ఓపిక పట్టాలి అమ్మా.
Comments
Please login to add a commentAdd a comment