
సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో ఒకసారి కూడా గెలవలేని పవన్ కల్యాణ్, లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కేటాయించాడని మండిపడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని మంగళవారం గుడివాడలో నియోజకవర్గ సచివాలయ సమన్వయకర్తలు, వాలంటీర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ముస్లిం వర్గాలని అంతా తనవారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంభోదిస్తారు. ఎంతో గట్స్ ఉన్న నేత కాబట్టే అలా అందరినీ తన వారిగా పిలుచుకుంటున్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు పదవులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియాన్ని పిల్లలకి అందించాలని మేం ప్రయత్నిస్తుంటే వాళ్ల పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న దిశగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. మేం పేదలకు మేలు చేస్తుంటే ఎల్లో మీడియాలో పెన్షన్ దారులకు షాక్.. రైతులకు షాక్ అని డిబేట్లు పెడుతున్నారు. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడులది మానసిక వైకల్యం' అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
చదవండి: (పవన్ కల్యాణ్‌తో ఆ సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తా: మంత్రి అమర్నాథ్)