సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గృహజ్యోతి పథకంలో గందరగోళం ఏర్పడిందన్నారు. అలాగే, రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా అనాలోచిత నిర్ణయం అని కామెంట్స్ చేశారు.
కాగా, తాజాగా హరీష్‌రావు మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రతరమైంది. కరెంట్ పోతుంది అంటే తొండలు పడ్డాయి అంటున్నారు. కరెంట్ పోతుంది అంటే హరీష్ రావు కరెంట్ తీయించేస్తున్నారని చెప్తున్నారు. నిర్వహణ లేక కరెంట్ సమస్యలు వస్తున్నాయి. కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని మా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉచిత కరెంటు ఇచ్చే వృత్తి కులాలకు ఫ్రీగా ఇవ్వటం లేదు. 91 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు గృహ జ్యోతి అందరికీ రావటం లేదు. గృహ జ్యోతి పథకంలో గందర గోళం ఏర్పడింది.
ఇదే సమయంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు అని చెప్పాను. ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు జీతాలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు అధ్వాన్నంగా మారాయి. సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది. పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం లో గ్రామ పంచాయతీలకు 270 కోట్లు ఇచ్చేవాళ్ళం. 750 కోట్లు కేంద్రం పంచాయతీ ఎన్నికలు జరపలేదని నిధులు ఆపింది.
తాజా మాజీ సర్పంచులు నా దగ్గరికి వచ్చి పిర్యాదు చేసారు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సర్పంచులు మాజీలు అయ్యారు. పంచాయతీ సెక్రటరీలు ఖర్చులు పెట్టుకొని గ్రామ పంచాయతీలు ఈ రెండు నెలలు నడిపించారు. కానీ, వారిని బదిలీలు చేస్తున్నారు. ఆ ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అనే డైలమాలో ఉన్నారు.
పాఠశాలలకు కూడా కూడా నిధులు ఇవ్వకపోగా పారిశుద్ధ్యం లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన నిధులు ఆపడం వల్ల వడ్డీలు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు నుంచి జీతాలు లేవు.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డు వద్దని చెప్పాను. పాస్ బుక్ ఉంటే చాలని రాత్రికి మళ్ళీ ప్రభుత్వం చెప్పింది. కానీ గ్రౌండ్ లెవల్‌లో మాత్రం రేషన్ కార్డుతోనే రుణమాఫీ చేస్తున్నారు. గ్రామాల్లో లక్ష రుణమాఫీ అంశంలో దాదాపు 30 నుంచి 35 శాతం మందికి రుణమాఫీ కాలేదు. మేము చేసిన సర్వేలో ఇది తేలింది. కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి తండ్రికి రుణమాఫీ ఆపుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలి. రేషన్ కార్డు నిబంధన తొలగించాలి. రైతును గుర్తించి రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment