హిమాచల్ ప్రదేశ్. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా రోడ్డుపక్కన టీ కొట్టుల్లో, ఆలయాల వద్ద, ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళలే వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు. ఆర్థిక స్వాతంత్య్రం రాజకీయ చైతన్యం ఇష్టపడే మహిళలు ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అందుకే ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లపై గాలం వేస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు అత్యంత కీలకంగా మారారు. రాష్ట్ర జనాభాలో 49% మంది మహిళలే ఉన్నారు. 1998 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓట్లు వేశారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 55,92,828 ఉంటే వారిలో పురుష ఓటర్లు 28,54,945, మహిళా ఓటర్లు 27,37,845, థర్డ్ జెండర్ ఓటర్లు 38 ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి జాతీయ సగటు కంటే హిమాచల్ ప్రదేశ్‌లో అధికం. ప్రతీ వెయ్యి మంది పురుషులకు జాతీయ స్థాయిలో 976 మంది మహిళలు ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 981 మంది ఉన్నారు. 18 నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి వెయ్యి దాటి ఉండడం విశేషం. ’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దేవేష్ కుమార్ వ్యాఖ్యానించారు.
పోటీ పడి హామీలు
అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది.
‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
ప్రాతినిధ్యం ఏది ?
మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించే పార్టీలు వారికి టికెట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 68 స్థానాలున్న అసెంబ్లీలో గత సారి కేవలం నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి బీజేపీ ఆరుగురికి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురుకి మాత్రమే ఇచ్చింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. 1998లో తొలిసారిగా ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 338 అభ్యర్థులు పోటీ పడితే వారిలో 19 మంది మాత్రమే మహిళలు. వారిలో నలుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
6% ఎక్కువగా మహిళల ఓటింగ్
హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు ఎంత విలువైనదో వారికి బాగా తెలుసు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎంతో అవగాహనతో ఉంటారు. అందుకే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలవచ్చి ఓట్లు వేస్తారు. గత 20 ఏళ్లుగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6 శాతం అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment