లోక్‌సభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్వీందర్ సుకును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం స్థానాన్ని భర‍్తీ చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జైరామ్ ఠాకూర్.
నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందనే అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం స్థానాల్ని గెలుపొందేలా పావులు కదుపుతున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు వారినే ప్రలోభాలకు గురి చేస్తుందంటూ ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జై రామ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల తిరుగు బావుటా
ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం నెలకొంది. గత కొంత కాలంగా సీఎం సుఖ్వీందర్ సుకు తీరుపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీకి కాంగ్రెస్‌కు చెందిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధికి క్రాస్ ఓటు వేశారు. ఈ అనూహ్య పరిణామాలతో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు.
అయితే, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపించడంతో ఎమ్మెల్యేలపై రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్ధులుగా కొనసాగుతున్నారు. ఈ వరుస పరిణామాలపై జై రామ్ ఠాకూర్ స్పందించారు.
సీఎం పదవి లోక్‌సభ ఎన్నికల వరకే
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం లేదని తెలిపారు. అందుకు మండి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్ల వ్యతిరేకత, ప్రతిభా సింగ్‌పై పార్టీ కార్యకర్తల అసమ్మతే కారణమని అన్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్‌విందర్ సుఖ్‌ను భర్తీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష నాయకుడు పేర్కొన్నారు.
రెబల్స్‌కు ఆఫర్లు
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు రెబల్స్‌ను ప్రలోభాలకు గురి చేస్తుందని అన్నారు. పార్టీలోకి ఆహ్వానించి వారు కోరుకున్న పదవులతో పాటు పార్టీ టిక్కెట్లు కూడా ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకు ఒప్పుకోకపోతే దాడులు తెగబడుతుందని మండి పడ్డారు.
కేజ్రీవాల్ అవినీతిపై
ఢిల్లీ సీఎం అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆప్ చేస్తున్న ఆందోళనలపై ఠాకూర్ స్పందించారు. తనకు తానుగా అత్యంత నిజాయితీపరుడినని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బహిర్గతమైందని, అలాంటప్పుడు ఆప్ నేతలు నిరసనలు చేసి ప్రయోజనం ఏముంటుందని బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment