ముంబై సెంట్రల్: ‘నేడు సూరత్– రేపు ముంబై’ ఈ సరికొత్త నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఏడాది జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవలే జరిగిన గుజరాత్, సూరత్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాన్నే సాధించి, 27 సీట్లను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది.
రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 227 సీట్లలో పోటీ చేస్తామనీ ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రూ.39 వేల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ముంబై నగర పాలిక సంస్థ దేశంలోనే ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందింది. దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ పెద్దది. మున్సిపల్ ఎన్నికల కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ నేత ప్రీతీ శర్మను బాధ్యురాలిగా నియమించింది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టిన ప్రీతి మాట్లాడుతూ, ‘ముంబై, సూరత్ సంస్కృతుల్లో ఎంతో స్వారూప్యత ఉందని, ఈ రెండు నగరాల మౌలిక సమస్యలు కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నారు. సూరత్ ప్రజల మాదిరిగానే ముంబై ప్రజలు కూడా సరికొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాల్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుందర్ బాలకృష్ణ మాత్రం ప్రీతీ శర్మ వ్యాఖ్యలతో విభేదించారు. ‘సూరత్ పరిస్థితి వేరని, ముంబైలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ లేదన్నారు. ఇక్కడి స్థానిక పార్టీ వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు అనవసరమైన జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తారని, ఆమ్ ఆద్మీకి ముంబైలో విజయం సాధించడం అంత సులువేం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment