
తిరుపతి ఎమ్మార్‌పల్లి వద్ద తన దగ్గరకు వచ్చిన అభిమానులను హెచ్చరిస్తున్న పవన్‌కల్యాణ్
సాక్షి, తిరుపతి: ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదు. మీడియాలో అలా ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలియదు’ అంటూ తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వ్యాఖ్యానించడం జనసేన పార్టీలో కాక రేపింది. ఆమె కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న జన సైనికులు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం మంచిదని పవన్‌కు సూచిస్తున్నారు. ఫలితంగా శనివారం తిరుపతిలో నిర్వహించాల్సిన పాదయాత్రను పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. హడావుడిగా రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో తూతూ మంత్రంగా ప్రసంగించి మమ అనిపించారు.
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య ఒప్పందం కుదరడంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కమలం పెద్దల ఒత్తిడితో పవన్ కల్యాణ్ తిరుపతి స్థానాన్ని బీజేపీకి వదిలేశారు. అయినప్పటికీ బీజేపీ నుంచి తమకు పెద్దగా సహకారం ఉండటం లేదని.. తమ మాటకు విలువ ఇవ్వడం లేదని జనసేన నేతలు వాపోతున్నారు. రత్నప్రభ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి వచ్చారు. పాదయాత్ర నిర్వహించకుండా కారులోనే వేగంగా అన్నమయ్య కూడలికి వెళ్లిపోయారు. అభిమానులు వెంట పడటంతో రోడ్ షో చేపట్టారు. అంతకు ముందు జనసేన నాయకులు బీజేపీకి ఇచ్చే మద్దతుపై పునరాలోచించాలని పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కారణంగానే పవన్ ప్రచారంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.