
తిరువనంతపురం: కేరళలో రెండో విడత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సీఎం పినరయి విజయన్(77) కొత్త కేబినెట్ కూర్పులో అనూహ్య మార్పులు చేపట్టారు. కేరళలో కరోనా మొదటి వేవ్ సమయంలో తీసుకున్న చర్యలతో అందరి మన్ననలు పొందిన ‘రాక్‌స్టార్’ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఈసారి చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. పినరయి విజయన్ అల్లుడు మొహమ్మద్ రియాస్‌కు మంత్రివర్గంలో బెర్త్ దక్కడం గమనార్హం.
మంగళవారం తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో సీపీఎం సీనియర్ నేత విజయన్‌ను సీపీఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కొత్త కేబినెట్‌లో సీఎం విజయన్ మినహా 11 మంది కొత్త వారి పేర్లను సీపీఎం ఆమోదించింది. కూటమి భాగస్వామి పార్టీ సీపీఐ కొత్తగా ఎన్నికైన నలుగురిని కేబినెట్‌కు నామినేట్ చేయనుంది.
పదవి ఖాయమని భావించినా..
2020లో దేశంలోనే మొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. అనంతరం రాష్ట్రంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో మంత్రిగా కేకే శైలజ(64) తీసుకున్న పలు చర్యలు ‘రాక్‌స్టార్ ఆరోగ్య మంత్రి’గా ఆమె పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంతో గత అనుభవం దృష్ట్యా ఆమెకు ఈ దఫా కూడా మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శైలజకు మంత్రి పదవి దక్కలేదు.
శెలజ పార్టీ విప్‌గా కొనసాగుతారని సీపీఎం తెలిపింది. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ముఖ్యమంత్రి అల్లుడు రియాస్ ప్రస్తుతం డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్‌ఐ) జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్‌లో 12 మంది సీపీఎం, నలుగురు సీపీఐ, కేరళ కాంగ్రెస్(ఎం), జనతా దళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని ఇప్పటికే స్పష్టత వచ్చింది.