పాడి రైతులను దగా చేసిన ధూళిపాళ్ల | Kilari Rosaiah Fires On Dhulipalla Narendra | Sakshi
Sakshi News home page

పాడి రైతులను దగా చేసిన ధూళిపాళ్ల

Published Sat, Apr 24 2021 4:31 AM | Last Updated on Sat, Apr 24 2021 8:49 AM

Kilaru - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సంగం డెయిరీ రైతులను నిలువు దోపిడీ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ధ్వజమెత్తారు. ధూళిపాళ్ల అక్రమాలకు ఆధారాలు ఉండబట్టే ఆయనను పోలీసులు అరెస్టు చేశారని స్పష్టం చేశారు. దీనికి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా పాల రైతులను మోసం చేసే వేల కోట్లు కూడబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలన్నింటినీ టీడీపీ నేతలకు కట్టబెట్టిన చరిత్ర ఆయనదేనని మండిపడ్డారు. ఇందులో ఆయన వాటా ఎంతో తెలియాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కిలారు రోశయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాడి రైతులకు మేలు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రోశయ్య ఇంకేమన్నారంటే.. 

చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు..
77 ఎకరాల్లో ఉన్న సంగం డెయిరీ ఆస్తులపై ధూళిపాళ్ల నరేంద్ర దొంగ సర్టిఫికెట్లు సృష్టించి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. అంతేకాకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్టు పెట్టి డెయిరీకి చెందిన 10 ఎకరాల భూమిని దానికి బదలాయించారు. ఎన్నికలకు ముందు డెయిరీ లాభాల్లోంచి లీటర్‌కు రూ.6.50 చొప్పున రైతులకు బోనస్‌గా ఇస్తామని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇందులో రూ.1.50 ట్రస్టుకు మళ్లించారు. ధూళిపాళ్ల ఎన్నికల చందా మరో రూ.1.50. ఇంకో రూ.2 సిబ్బంది, ఏజెంట్లకు బోనస్‌ అట. ఇవన్నీ పోగా రైతుకు మిగిలింది కేవలం రూ.1.50 మాత్రమే. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ కాదా? దీనిపై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పేముంది? తన హయాంలో అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబు.. నరేంద్రను వెనకేసుకొస్తున్నారా? బాబుకు కూడా ఇందులో వాటాలున్నాయా? సంగం డెయిరీ ద్వారా నరేంద్ర వేల కోట్లు కూడబెట్టారు. 

బాబు పాలనలో సహకార డెయిరీలు నాశనం
చంద్రబాబు తన హయాంలో సహకార డెయిరీలను సర్వనాశనం చేశారు. తన హెరిటేజ్‌ సంస్థ కోసం చిత్తూరు డెయిరీని మూసేశారు. రైతులపై చంద్రబాబు, లోకేష్‌కు ఏ మాత్రం ప్రేమ లేదు. రైతన్నకు నష్టం రాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. అమూల్‌ మూడు జిల్లాల్లో పాల సేకరణ చేస్తోంది. ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.5 నుంచి రూ.10 వరకూ అధికంగా చెల్లిస్తోంది. దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న అమూల్‌కు రైతులే యజమానులు. ఏపీలోనూ లాభాలను రైతులకే పంచాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టీడీపీ దీన్ని పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement